ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతాం
రాయదుర్గం: ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కల్యాణ మంటపంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్వో మలోల, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 360 వినతులు అందాయి. ఎక్కువ భాగం భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అర్జీల్లో 70 నుంచి 80 శాతం పరిష్కారం చూపుతున్నారని, వంద శాతం పరిష్కరించేలా కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, ఆనంద్, మల్లికార్జున, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ వసంతబాబు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, సీపీఓ అశోక్‌కుమార్, డీఎస్పీ రవిబాబు, పట్టణ, రూరల్ సీఐలు జయనాయక్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసేలా చొరవ చూపాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్పతో పాటు ఐనాపురం మంజునాథ, పైతోట సంజీవ, శివకుమార్, వార్డు ఇన్‌చార్జులు పొరాళ్ల శివ, రామాంజినేయులు, శ్రీరామిరెడ్డి, బషీర్, కృష్ణమూర్తి, దివాకర్, నిజాముద్దీన్, కో–ఆప్షన్ మెంబర్లు సజీర్, శ్రీనివాసులు, బాబు, దేవేంద్ర తదితరులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.డంపింగ్ యార్డు తొలగింపునకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కంపోస్టు యార్డు నిర్మాణానికి స్థలం చూపాలన్నారు.
● దివ్యాంగురాలైన తనకు పెన్షన్ మంజూరు చేయాలని రహీనబేగమ్ విజ్ఞప్తి చేశారు. వీల్‌చైర్‌లో వచ్చిన ఆమె వద్దకు స్వయంగా కలెక్టర్ వెళ్లి వినతి పత్రం స్వీకరించారు.
● పట్టణంలోని మసీదుల వద్ద వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఉర్దూ పాఠశాలకు దారి, ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఖాజా వినతి పత్రం సమర్పించారు.
● ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని స్టీల్‌ప్లాంట్ సాధన కమిటీ అధ్యక్షుడు నాదల్‌ఆలీ కోరారు. డీ హీరేహాళ్‌లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నిర్మించాలని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి నాయకుడు అంజి, మురడిలో రస్తా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.
కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్
‘దుర్గం’లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
వివిధ సమస్యలపై 360 వినతులు
Comments
Please login to add a commentAdd a comment