తీర్థయాత్రకు వెళ్లి తిరిగి రాని లోకాలకు
తాడిపత్రి రూరల్: భర్తతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తాడిపత్రికి చెందిన వివాహిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాశీ వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. వివరాలు.. తాడిపత్రిలోని గన్నెవారిపల్లి కాలనీకి చెందిన నాగలక్ష్మి (53), రాజన్న దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. మండలంలోని బుగ్గ వద్ద రాజన్న పంక్చర్ షాపు నిర్వహిస్తున్నాడు. ముగ్గురు కుమార్తెలకూ పెళ్లిళ్లు కావడంతో తీర్థయాత్రలకు వెళ్లాలన్న కోరిక భార్యాభర్తలకు కలిగింది. ఈ నెల 3న తాడిపత్రి నుంచి 13 రోజుల పాటు అయోధ్య, ప్రయాగ్ రాజ్, కాశీ తదితర పుణ్యక్షేత్రాల సందర్శనకు బస్సులో వెళ్లారు. గత శుక్రవారం ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. శనివారం రాత్రి కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే కాశీ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో టీ తాగేందుకు డ్రైవర్ రోడ్డు పక్కన బస్సును నిలపగా.. వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన నాగలక్ష్మితో పాటు మరో ఆరుగురిని స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నాగలక్ష్మిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌కు తీసుకురాగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని సోమవారం గన్నెవారిపల్లి కాలనీకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో నాగలక్ష్మి పక్కనే భర్త రాజన్న నిద్రిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తలుచుకుని ఆయన గుండెలవిసేలా రోదించారు. మాజీ సర్పంచ్ లింగం కృష్ణయ్య తదితరులు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
Comments
Please login to add a commentAdd a comment