అనంతపురం ఎడ్యుకేషన్: హోం వర్క్ రాయలేదనే కారణంతో మూడో తరగతి విద్యార్థిని టీచర్ చితకబాదిన ఘటన అనంతపురం రూరల్ మండలం కురుగుంటలోని శ్రీభారతి ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది. శనివారం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల మేరకు...అక్కంపల్లి పంచాయతీ ఎన్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణస్వామి కుమారుడు జయసూర్య శ్రీభారతి ప్రైవేట్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న విద్యార్థి హోం వర్క్ రాయలేదని గుర్తించిన టీచరు బెత్తంతో చితకబాదింది. విద్యార్థి చేతిపై వాతలు తేలాయి. సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తండ్రికి విషయం చెప్పాడు. తర్వాత రోజు సెలవు రోజు కావడంతో సోమవారం విద్యార్థి తండ్రి నారాయణస్వామి, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు వెళ్లారు. విద్యార్థిని ఇష్టానుసారం ఎలా కొడతారని ప్రశ్నించగా...సదరు టీచర్ ఎదురుదాడికి దిగింది. దెబ్బలు కొట్టకుంటే పిల్లలకు చదువులు ఎలా వస్తాయని నిలదీసింది. విద్యార్థి తండ్రి, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి చేరుకుని డీఈఓ ప్రసాద్‌బాబుకు ఫిర్యాదు చేశారు. వాతలు పడేలా కొట్టిన టీచరుపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి కుళ్లాయిస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్‌యాదవ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మంజునాథ్, వంశీ, సాయి ఉన్నారు.
17ఏటీపీసీ70డీ
డీఈఓ ప్రసాద్‌బాబుకు ఫిర్యాదు చేస్తున్న విద్యార్థి
తండ్రి, విద్యార్థి సంఘాల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment