అనంతపురం అగ్రికల్చర్: ఆధార్ నంబర్ మాదిరిగా రైతులకు ఐడీ నంబర్లు కేటాయించేందుకు చేపడుతున్న రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే, కనీక సదుపాయాలు కల్పించకుండానే రంగంలోకి దించడంతో సమస్య తలెత్తుతున్నట్లు తెలిసింది. నాలుగు రోజులుగా అగ్రీ స్టాక్ యాప్‌లో రైతుల రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. అయితే యాప్‌లో నెలకొన్న సాంకేతిక కారణాల వల్ల డీ–పట్టా భూములు కలిగిన రైతులకు, ఒకే సర్వే నంబరుతో ఇద్దరు, ముగ్గురికి భూములు కలిగిన వారికి ఐడీ నంబరు కేటాయింపు జరగడం లేదని సమాచారం. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. వీరందరికీ ఐడీ నంబరు లేకుండా మున్ముందు ప్రభుత్వ పథకాల వర్తింపులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పంట నమోదు, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఎంఎస్‌పీ అమ్మకాలు తదితర అన్ని రకాల పథకాలు వర్తించాలంటే రైతుకు తప్పనిసరిగా ప్రత్యేక ఐడీ నంబరు ఉండాలని షరతు విధించడంతో చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్ కింద రిజిస్టర్ అయిన 2.79 లక్షల రైతుల అకౌంట్ల ఆధారంగా ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. నెలాఖరుకు 40 శాతం పూర్తీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికి 32 వేల మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గుంతకల్లు, తాడిపత్రి, కణేకల్లు, పెద్దవడుగూరు, గుత్తి మండలాల్లో మాత్రమే 2 వేలకు పైగా పూర్తి కాగా... కుందుర్పి, వజ్రకరూరు, శెట్టూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, శింగనమల తదితర మండలాల్లో ఇంకా 200 నుంచి 400 మంది రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment