చికెన్ కర్రీస్ కాదు.. బర్డ్‌ఫ్లూ వైరస్ వర్రీనే ఇప్పు
తాడిపత్రి రూరల్: జిల్లాలోని చికెన్ సెంటర్లపై బర్డ్ ప్లూ ప్రభావం పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ వ్యాపించి లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. జిల్లాలో బర్డ్ ప్లూ ప్రభావం లేదని పశు సంవర్దక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం భయం వీడడం లేదు. చికెన్ తిని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అనే ధోరణి సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో కొనుగోలుదారులు లేక చికెన్ సెంటర్లు వెలవెలపోతున్నాయి. ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి కోళ్ల పెంపకం చేపట్టిన వారు ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు.
కర్ణాటక నుంచే దిగుమతి
జిల్లాలోని కంబదూరు, కళ్యాణదుర్గం, కుందుర్పి, పామిడి తదితర ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించింది. పేరొందిన వెంకోబ్, సుగుణ,స్నేహ, లోటస్ తదితర కంపెనీలు ఆయా ప్రాంతాల్లో రైతులకు కోడి పిల్లలను పంపిణీ చేసి పెంపకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటి వరకూ జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ నుంచే మిగిలిన ప్రాంతాలకు కోళ్లు సరఫరా అయ్యేవి. బర్డ్‌ఫ్లూ ప్రభావం కారణంగా ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలోని బెంగళూరు, పావగడ, చిక్కబళ్లాపూర్, దొడ్డబళ్లాపురం, చిత్రదుర్గ ప్రాంతల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు.
నెలకు 20 లక్షల కిలోలకు పైగా అమ్మకాలు
జిల్లా వ్యాఫ్తంగా 1,500 నుంచి 2వేల వరకు చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఆయా చికెన్ సెంటర్ల నుంచి నెలకు 20లక్షల కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతుండేవి. పండుగలు, ఇతర శుభ కార్యాల్లో దీనికి అదనంగా విక్రయాలు సాగేవి. వందల సంఖ్యలో కుటుంబాలు చికెన్ కబాబ్ బండ్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాయి. దాదాపు 10వేల మందికి పైగా స్థానికులు, స్థానికేతరులు నెలసరి జీతాలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం బర్డ్ ప్లూ ప్రభావంతో వీరి జీవనం దుర్భరంగా మారింది. సగానికి పైగా వ్యాపారం పడిపోవడంతో చికెన్ విక్రేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ల నిర్వహణకు తీసుకున్న గదులకు సంబంధించి అద్దెలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అద్దెలు, కార్మికులు, విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
పశు సంవర్దక శాఖ అప్రమత్తత
జిల్లాల్లో బర్డ్ ప్లూపై పశుసంవర్దక శాఖ అప్రమత్తంగా ఉంది. కోస్తా ప్రాంతంలో కనిపించిన బర్డ్ ప్లూ వైరస్ జిల్లాను తాకకుండా ప్రతి మండలానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్‌ఆర్‌టీ)ను ఏర్పాటు చేసింది. ఇందులో వెటర్నరీ డాక్టర్‌తో పాటు నలుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ బృందాలు పౌల్ట్రీ పరిశ్రమలను పరిశీలించి కోళ్లకు వైద్యపరీక్షలు నిర్వహిస్తాయి. అనుమానిత కోళ్ల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు.
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ సేల్స్ ఢమాల్
సగానికి పైగా తగ్గిన వ్యాపారం
కొనుగోలుదారులు లేక చికెన్ సెంటర్ల వెలవెల
ఆందోళనలో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు
చికెన్ కర్రీస్ కాదు.. బర్డ్‌ఫ్లూ వైరస్ వర్రీనే ఇప్పు
Comments
Please login to add a commentAdd a comment