రాయితీతో మామిడి ఫ్రూట్ కవర్లు
● హెక్టారుకు రూ.10 వేలు ప్రోత్సాహం
అనంతపురం అగ్రికల్చర్: మామిడిలో నాణ్యమైన దిగుబడుల కోసం రైతులకు ప్రోత్సాహక రాయితీలు అందించనున్నట్లు ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాయలు మంచి పండ్లుగా తయారవడానికి వీలుగా రాయితీతో రక్షణ కవచం (ఫ్రూట్ కవర్) రాయితీతో ఇస్తామన్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా 50 శాతం రాయితీతో గరిష్టంగా ఒక హెక్టారుకు రూ.10 వేల వరకు రాయితీ వర్తింపజేస్తామన్నారు. కాయలు కోడిగుడ్డు సైజులో ఉన్నపుడు కవర్లు చుట్టాలన్నారు. గాలి చొరబడకుండా తొడిమ వరకు కట్టాలన్నారు. దీంతో ఊజీ ఈగ, తేనెమంచు పురుగు, మచ్చలు, తామర పురుగుల నుంచి రక్షణ ఉంటుందన్నారు. అధిక సూర్యరశ్మి, వడగండ్ల వాన నుంచి కూడా కాపాడుకోవచ్చన్నారు. తొడిమ కూడా దృఢంగా తయారై మంచి సైజు వస్తుందన్నారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఉద్యానశాఖ అధికారులు లేదా రైతు భరోసా కేంద్రాల అసిస్టెంట్లను సంప్రదించాలన్నారు.
సుదర్శనరావుకే
వీసీ బాధ్యతలు
అనంతపురం: ఇన్‌చార్జ్ వీసీగా ఉన్న ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావుకే ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలు కట్టబెట్టింది. జేఎన్‌టీయూ (ఏ) నూతన వీసీగా ఆయనను నియమిస్తూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ సుదర్శనరావు జేఎన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాలలోనే బీటెక్ పూర్తి చేశారు. ఇక్కడే చదివి అత్యున్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం దక్కడం గమనార్హం. గతంలో జేఎన్‌టీయూ అనంతపురంలో మూడున్నర సంవత్సరాలు ఆయన రెక్టార్‌గా పనిచేశారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు.
రైతులు ఇబ్బందులు
పడకుండా చర్యలు
పుట్లూరు: రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మండలంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ వినోద్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరేపల్లి రెవెన్యూ గ్రామ 167 ఎల్‌పీఎం నంబర్‌లో 6.04 ఎకరాలు జాయింట్‌గా నమోదు కావడంతో రైతులు సబ్‌డివిజన్ చేయాలని ఇటీవల వినతి పత్రం అందించారన్నారు. తహసీల్దార్ శేషారెడ్డి, సర్వేయర్లు రైతులకు నోటీసులు అందించి హద్దులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మండలంలోని అరకటివేముల గ్రామ సచివాలయం నుంచి జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు రోజూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలన్నారు. హౌస్‌హోల్డ్ మిస్సింగ్ సిటిజన్ ప్రక్రియను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
24న ‘పీఎం కిసాన్’!
అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ కింద ఈనెల 24న రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.2 వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జూన్, అక్టోబర్, జనవరిలో విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఏటా రూ.6 వేల ప్రకారం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కాస్త ఆలస్యంగా ఫిబ్రవరిలో మూడో విడతగా 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.58 కోట్లు విడుదల కావొచ్చని చెబుతున్నారు. మొదటి రెండు విడతలతో పోలిస్తే మూడో విడతలో మరికొందరు రైతులు ‘పీఎం కిసాన్’కు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.
రాయితీతో మామిడి ఫ్రూట్ కవర్లు
రాయితీతో మామిడి ఫ్రూట్ కవర్లు
Comments
Please login to add a commentAdd a comment