భూ సమస్యలు పునరావృతం కారాదు
ప్రశాంతి నిలయం: జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా రికార్డులు పక్కాగా రూపొందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఆదేశించారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్, రీ సర్వే, రెవెన్యూ సదస్సులతో పాటు పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ టీఎస్ చేతన్‌తో కలసి అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భూముల వర్గీకరణతో కూడిన మ్యాప్‌లు తయారు చేయాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్, 22ఎ, డి.నోటిఫైడ్, భూసేకరణ, సమీకరణ, ఫ్రీహోల్డ్, డిజిటలైజేషన్, జాయింట్ ఎల్‌పీఎంల రూపకల్పనతో పాటు ఇతర రెవెన్యూ అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో విజయసారథి, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, మహేష్, ఆనంద్‌కుమార్, 32 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా
Comments
Please login to add a commentAdd a comment