నేడు
నాడు
వన్యప్రాణుల సంరక్షణకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. వేసవిలోనే కాదు.. మిగిలిన అన్ని సీజన్లలోనూ నీటి కోసం వన్యప్రాణులు విలవిల్లాడకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తొట్టెలు ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా వాటిని నీటితో నింపుతూ వచ్చింది. ఈ చర్యలతో అటవీ ప్రాంతాన్ని వీడి ఏనాడూ వన్యప్రాణులు గ్రామాల బాట పట్టింది లేదు.
వన్యప్రాణుల సంరక్షణపై ప్రస్తుత కూటమి సర్కార్ ఉదాసీనత కనబరుస్తోంది. వేసవి ప్రారంభం కాక ముందే ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నా ఇప్పటి వరకూ వన్యప్రాణుల దాహార్తీని తీర్చే చర్యలు చేపట్టలేదు. ఫలితంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడంతో దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు గ్రామాల బాట పడుతున్నాయి.
మానిరేవు బీట్‌లో తొట్టెలోకి నీరు పడుతున్న అటవీ సిబ్బంది (ఫైల్)
రాయదుర్గం: వేసవి ప్రారంభానికి ముందే ఫిబ్రవరి రెండో వారంలోనే భానుడు ప్రచండ నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకకపోవడంతో గ్రామాల బాట పడుతున్నాయి. దాహార్తీ తీరేలోపు చాలా మూగజీవాలు మృత్యువాత పడుతుండగా, మరికొన్ని వీధి కుక్కలు, వేటగాళ్ల బారిన పడి చనిపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణపై కూటమి సర్కార్ ఉదాసీనత కనబరుస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, కణేకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కూడేరు తదితర గ్రామాల్లో ఇప్పటికే ఎలుగుబంట్లు, చిరుతలు, తాడిపత్రి, యాడికి, యల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, గుత్తి, గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో జింకలు, దుప్పిలు, కుందేళ్లు. ఇతర మూగజీవాలు దాహం తీర్చుకునేందుకు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో సరైన నీటి వసతిని ప్రభుత్వం కల్పించకపోవడంతోనే సమీప పొలాల్లోని ట్యాంకుల్లో దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు వస్తుంటాయని రైతులు అంటున్నారు.
వంద తొట్టెల నిర్మాణం
జిల్లాలోని మూడు ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో 74,400 హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతం వేలాది వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ క్రమంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని ఫారెస్ట్ రేంజ్‌లలో సుమారు వందకు పైగా నీటి తొట్టెలను నిర్మించింది. ఇందు కోసం రూ.లక్షలు వెచ్చించింది. వీటికి తోడు సాసర్ రింగ్స్, చెక్‌డ్యామ్‌లు, పెర్కోలేషన్ ట్యాంకులు, నీటి కుంటల్ని నిర్మించి సీజన్‌తో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా నీటితో నింపుతూ వస్తుండడంతో ఏనాడూ వన్యప్రాణాలు అటవీ ప్రాంతాన్ని వీడి జనావాసాల్లోకి వచ్చింది. లేదు. అడవుల సరంక్షణ, వన్యప్రాణుల చట్టాలపై సమీప గ్రామాల ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చింది. దీంతో కారుచిచ్చు నుంచి అడవుల్ని కాపాడుకునే బాధ్యత ప్రజలే స్వచ్ఛందంగా తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వన్యప్రాణి సంరక్షణ చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదని గ్రామీణులు అంటున్నారు. దీంతో అడవికి అందాలుగా చెప్పుకునే వన్యప్రాణులు దాహంతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు లేవు
వన్యప్రాణుల సంరక్షణకు కంపా, బయోసాట్ పథకాల కింద నిధులు అందాల్సి ఉంది. ప్రస్తుతం కంపా పథకం కింద రూ.50 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతకు మించి నిధులేమీ లేవు. అన్నీ రేంజీల పరిధిలోనూ వన్యప్రాణుల తాగునీటి అవసరాలను గుర్తించాం. దానికి తగినట్లుగా నీటి వసతి ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాం. వన్యప్రాణులతో పాటు అడవులను కాపాడుకునే బాధ్యత తీసుకున్నాం. అవసరమైనచోట సాసర్‌రింగ్స్‌ను అందుబాటులోకి తీసుకోస్తాం.
– విజ్ఞేష్ అప్పావు,
డీఎఫ్‌ఓ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment