కొరవడిన ముందుచూపు
గుంతకల్లు టౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు గానూ బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఇంటర్వ్యూలు నిర్వహించలేక అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా ఇంటర్వ్యూలు వాయిదాపడ్డాయి. ఇంటర్వ్యూలకు ఒక్క రోజు ముందు పత్రికా ప్రకటన ఇవ్వడం... ప్రణాళిక లేకుండా అర్ధ రోజులోనే ఇంటర్వ్యూలను ముగించాలనుకోవడం అధికారిక వైఫల్యాలకు కారణంగా తెలుస్తోంది. ముందుచూపులేని అధికారులు హడావుడిగా తీసుకున్న నిర్ణయాల వల్ల మండుటెండల్లో అభ్యర్థులు నానా తిప్పలు పడ్డారు. ఒకానొక దశలో తోపులాట చోటు చేసుకోవడంతో తోపులాటను చూసి బ్యాంకు అధికారులు భయాందోళనలకు గురయ్యారు. బీసీ, ఈబీసీ కింద 117 యూనిట్లకు సుమారు 1,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ ఇంటర్వ్యూలకు హాజరవుతారని తెలిసి కూడా కార్యాలయ ఆవరణలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. కాగా, మున్సిపల్ కమిషనర్ నయీమ్ బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని సీఐటీయూ పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు మండిపడ్డారు. ఇంటర్వ్యూలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తున్నట్లుగా ముందస్తుగా తమకు ఎందుకు సమాచారమివ్వలేదని మున్సిపల్ కమిషనర్ నయీమ్, సంబంధిత అధికారులను పోలీసు అధికారులు నిలదీశారు. తొక్కిసలాట జరిగితే బాధ్యత వహిస్తారా అంటూ టూటౌన్ సీఐ మస్తాన్ ప్రశ్నించారు. ఇంటర్వ్యూ తేదీ ఒక్క రోజు ముందు ఖరారు కావడంతో మౌలిక వసతులు కల్పించలేకపోయినట్లు మెప్మా టీపీఆర్‌ఓ మోహన్ తెలిపారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇంటర్వ్యూలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇంటర్వ్యూలు నిర్వహించలేక చేతులెత్తేసిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment