సుత్తితో మోది.. బంగారు నగల అపహరణ
ఓడీచెరువు: ఇంటి తలుపుతట్టిన దుండగులు...డోరు తీసిన మహిళ నెత్తిపై సుత్తితో మోది ఆమె వంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఓడీచెరువులో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు... వైద్య,ఆరోగ్యశాఖ విశ్రాంత ఉద్యోగి లక్ష్మమ్మ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో దుండగులు తలుపుతట్టి పేరుపెట్టి పిలిచారు. దీంతో ఆమె తలుపుతీయగానే సుత్తితో తలపై కొట్టడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆమె మెడలోని గొలుసు, చేతికున్న బంగారు గాజులను దుండగులు తీసుకెళ్లిపోయారు. కాసేపటి తర్వాత మెలుకున్న లక్ష్మమ్మ తన కూతురుకు ఫోన్ చేసి విషయం తెలిపడంతో ఆమె వచ్చి తల్లిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అనంతరం స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మొత్తంగా 14 తులాల బంగారు నగలు దుండగులు అపహరించినట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని సత్యసాయి నగర్‌కు చెందిన అశోక్ (35) ఇటుకల బట్టీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంత కాలంగా మదన పడుతున్న అశోక్ బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై చెన్నేకొత్తపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ప్యాదిండి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment