సీసీ కెమెరాల్లేవు.. రికార్డుల ఊసే లేదు
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులో ఉన్న ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో డొల్లతనం బయట పడింది. రెసిడెన్షియల్ కళాశాల నిర్వహణలో తీసుకోవాల్సిన కనీస చర్యలు పాటించడం లేదని వెల్లడైంది. కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థి మృతిపై అనుమానాలు తలెత్తుతుంటే, మరోవైపు కళాశాలలో కనీస భద్రత చర్యలు లేకపోవడంపై చర్చ జరుగుతోంది. కళాశాలలో సీసీ కెమెరాలు లేవు. కాంపౌండ్ ఎత్తు లేదు. విద్యార్థుల అటెండెన్స్ నిర్వహణ లేదు. సెక్యూరిటీ లేడు. గేటు వద్ద కచ్చితంగా రిజిస్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి బయటకు వెళ్లాలంటే యాజమాన్యంతో అనుమతి తీసుకోవాలి. బంధువులు వస్తే వారి ఊరు, పేరు, సంతకం, వచ్చిన సమయం రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాతనే విద్యార్థిని బయటకు పంపాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. రాత్రి విద్యార్థి బయటకు పోతే వార్డెన్ ఏం చేస్తున్నాడు?ఎందుకు గుర్తించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇక.. రాత్రి పడుకునే ముందు అన్ని గదుల్లోకి వెళ్లి విద్యార్థుల అటెండెన్స్ తీసుకోవాలి... అలా జరిగి ఉంటే విద్యార్థి శ్రీకాంత్ లేడనే విషయం అప్పుడే వెలుగు చూసేది. కానీ ఇక్కడ మాత్రం మరుసటి రోజు ఉదయం విద్యార్థి చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించేదాకా ఆ విద్యార్థి బయటకు వెళ్లాడనే సమాచారమే లేకపోవడం గమనార్హం.
ప్రిన్సిపాల్ సెల్ స్విచ్చాఫ్..
కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్‌బాబు మంగళవారం ఉదయం 7.45 గంటలకు కళాశాలకు వచ్చాడు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలీగానే అక్కడి నుంచి వెళ్లిపోయి తన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్తే అందుబాటులో లేరు. తీరిగ్గా బుధవారం ఉదయం కళాశాలకు రావడం విమర్శలకు తావిచ్చింది.
డీఎస్పీ ఆగ్రహం..
విద్యార్థుల భద్రతకు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఏజీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజులు వసూళ్లు చేసినంతగా విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి బయటకు పోయిన విద్యార్థి ఉదయం శవమై తేలేంతవరకూ తెలీదా అని ప్రశ్నించారు. ‘తరచూ రౌండ్స్‌కు వస్తుంటారు కదా... కళాశాలలో విద్యార్థుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది పరిశీలించక పోతే ఎలా?’ అని రూరల్ పోలీసులపైనా అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఇంటర్ బోర్డు అధికారులు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని, తరచూ కళాశాలలను తనిఖీలు చేసి, లోపాలుంటే సరిదిద్దేలా ఆదేశాలు జారీ చేసి ఉంటే ఈరోజు ఇంతటి పరిస్థితి ఉండేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.
క్రిమినల్ కేసు నమోదు చేయాలి..
ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శ్రీకాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్బీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఐఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తక్షణమే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కుళ్లాయిస్వామి, పరమేష్, పృథ్వి, సురేష్, హనుమంతరాయుడు, వంశీ, చందు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్ కళాశాలలో భద్రత డొల్ల
రోజంతా పత్తా లేకుండా
పోయిన ప్రిన్సిపాల్
సీసీ కెమెరాల్లేవు.. రికార్డుల ఊసే లేదు
Comments
Please login to add a commentAdd a comment