హజ్ యాత్రికులకు అవగాహన తరగతులు
అనంతపురం కల్చరల్: జిల్లా నుంచి హజ్‌కు వెళ్తున్న యాత్రికులకు ఈ నెల 22 నుంచి ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించునున్నారు. ఈ మేరకు హాజీ ఖాదిమ్ మహమ్మద్ రఫీ గురువారం ఓ ప్రకటన విడదుల చేశారు. అనంతపురంలోని పీటీసీ ఎదురుగా ఉన్న చాందినీ మసీదులో ఉదయం 10 నుంచి 11 .30 గంటల వరకు అవగాహన తరగతులుంటాయి. హజ్ విధిఽవిధానాలను తెలియజేసే పుస్తకాలను సైతం అందిస్తారు. మహిళలకు పర్దా సౌకర్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలకు 94409 83090, 86885 26178లో సంప్రదించవచ్చు.
మట్కా బీటర్ల అరెస్ట్
రాయదుర్గం: స్థానిక రూరల్ సర్కిల్ పరిధిలోని డి.హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట మండలాల్లో గురువారం పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలువురు మట్కా బీటర్లు పట్టుబడ్డారు. వివరాలను సీఐ వెంకటరమణ వెల్లడించారు. బొమ్మనహాళ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద బళ్లారికి చెందిన మట్కా నిర్వాహకుడు ఇమ్రాన్ పట్టుబడ్డాడు. రూ.50,500 నగదుతో పాటు మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కణేకల్లు పీఎస్ పరిధిలోని అంబాపురం గేటు వద్ద పాపసాని సత్యనారాయణరెడ్డిని అరెస్ట్ చేసి రూ.41,980 నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. డి.హీరేహాళ్ మండలం నాలాలపురం శివారులో మట్కా రాస్తూ ఎర్రిస్వామి, నారాయణ, లాలూస్వామి, కల్యం గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.64,865 స్వాధీనం చేసుకున్నారు. గుమ్మఘట్ట మండలం పూలకుంటలో మట్కా రాస్తున్న వడ్డే వన్నూరుస్వామి, వడ్డే హరిని అరెస్ట్ చేసి రూ.25 వేలు నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. బీటర్ల అరెస్ట్‌లో చొరవ చూపిన ఎస్‌ఐలు గురుప్రసాదరెడ్డి, నాగమధు, నబీరసూల్, ఈశ్వరయ్యను సీఐ వెంకటరమణ అభినందించారు.
లారీ ఢీ... వృద్ధుడి మృతి
గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి శివారులో గురువారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన విశ్రాంత పోస్ట్‌మెన్ మస్తాన్‌వలి (66) వ్యక్తిగత పనిపై గురువారం కర్నూలు జిల్లా జి.ఎర్రగుడి తండాకు వెళ్లాడు. అక్కడ పనిముగించుకుని రాత్రికి తిరుగు ప్రయాణమైన ఆయన ఆటో ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో గుత్తి నుంచి పత్తికొండ వైపునకు వెళ్తున్న లారీ ఢీకొంది. ఘటనలో ఆయన రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స మొదలు పెట్టేలోపు ఆయన మృతిచెందాడు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లడాన్ని గమనించిన స్థానిక యువకులు ద్విచక్ర వాహనాల్లో వెంబిడిస్తూ కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో పట్టుకున్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుడిపై కత్తితో దాడి
రాప్తాడు రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఇటుకలపల్లికి చెందిన సిద్ధార్థ్... అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. కందుకూరు గ్రామానికి చెందిన ప్రభాస్ కూడా ఇదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య ఇటీవల కళాశాలలో గొడవ జరిగింది. విషయాన్ని ప్రభాస్ తన గ్రామంలోని స్నేహితుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధార్థ్ స్నేహితుడు సతీష్ పుట్టిన రోజు కావడంతో మధ్యాహ్నం స్నేహితులందరూ కలసి అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల వెనుక బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రభాస్, అతని స్నేహితులు అక్కడికి చేరుకుని, సిద్ధార్థ్‌తో గొడవకు దిగారు. సర్ది చెప్పే ప్రయత్నం చేసిన బర్త్‌డే బాయ్ సతీష్‌పై కత్తితో దాడి చేసి, అక్కడి నుంచి ఉడాయించారు. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి బాధితుడు సతీష్‌తో మాట్లాడి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
లేపాక్షి: పెళ్లి కాలేదన్న దిగాలుతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం కుర్లపల్లికి చెందిన రామాంజినేయులు (26)కు కుటుంబసభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేపట్టారు. అయితే ఏ సంబంధమూ కుదరలేదు. దీంతో తనకు పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదేమోనని దిగాలుతో గురువారం ఉదయం లేపాక్షి చెరువు కట్టపై ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదంలో మున్సిపల్
కార్మికుడి మృతి
పావగడ: స్థానిక శని మహాత్మ సర్కిల్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడు మంజునాథ్ (40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గురువారం ఉదయం 11 గంటల సమయంలో సర్కిల్ వద్ద రోడ్డు పక్కన చెత్తను శుభ్రం చేస్తుండగా ఎస్‌ఎస్‌కే సర్కిల్ నుంచి ఆర్‌జే సర్కిల్ వైపు వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ టైర్ తగలడంతో మంజునాథ్ తలకు బలమైన రక్తగాయమైంది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తుమకూరు జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment