మహిళపై వేట కొడవలితో దాడి
అనంతపురం: స్థానిక పాతూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో నివాసముంటున్న హేమలతపై మంగలి బాలఓబులేసు అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వందలాది మంది చూస్తుండగా వేటకొడవలితో వెంటాడి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు తెలిపిన మేరకు... నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన హేమలత భర్త కొంత కాలం క్రితం మృతి చెందాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతపురంలోని అత్త, మామ వద్ద పిల్లలు ఉంటూ చదువుకుంటున్నారు. కొంత కాలంగా హేమలతకు మంగలి బాలఓబులేసుతో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన బాలఓబులేసు వేటకొడవలితో దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఆమె విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడిన బాల ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా వాసులు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు, బీసీ, పంచాయతీరాజ్, బూత్ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా తరిమెల వంశీగోకుల్‌రెడ్డి, చౌల మల్లయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధిగా భాస్కరరెడ్డి, సహాయ కార్యదర్శిగా అలేరి రాజగోపాల రెడ్డి, వాచిపల్లి నరేంద్రరెడ్డికి చోటు దక్కింది. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గోగుల పుల్లయ్య, తలారి వెంకటేశులు, సహాయ కార్యదర్శులుగా కురుబ శ్రీనివాసులు, ఎంఏ నవీన్‌కుమార్, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బెడదల మదన్‌మోహన్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఎం.బసవ రాజు, షేక్ సాదిక్ వలి, బూత్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోగుల రాధాకృష్ణ నియమితులయ్యారు.
రేషన్ బియ్యం పట్టివేత
కణేకల్లు: అక్రమంగా కణేకల్లు నుంచి ఐచర్ వాహనంలో తరలిస్తున్న రేషన్ బియాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కణేకల్లు నుంచి గురువారం కర్ణాటకకు రేషన్ బియ్యం తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న అనంతపురం విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, తన సిబ్బందితో కలసి తనిఖీలు చేపట్టారు. ఐచర్ వాహనాన్ని సీజ్ చేసి, పీఎస్‌కు తరలించారు. 270 బస్తాల బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న వేణుగోపాల్‌తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment