ఆటోను ఢీకొన్న కారు
పామిడి: మండలంలోని గజరాంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై పెయింట్ డబ్బాలతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొంది. ఘటనలో ఆటో బోల్తాపడి అనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి తొలుత పామిడి సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించి, అనంతపురానికి రెఫర్ చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన హైదరాబాద్‌కు చెందిన వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఘటనలో దాదాపు రూ.2 లక్షల విలువైన సరుకు రోడ్డు పాలైందని ఆటో డ్రైవర్ తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులను బెదిరించిన వారిపై కేసు నమోదు
బెళుగుప్ప: పోలీసులను బెదిరించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు బెళుగుప్ప ఎస్ శివ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తగ్గుపర్తి రోడ్డు సమీపంలోని విండ్ పవర్ స్టేషన్ వద్ద బుధవారం బహిరంగ మద్యపానం చేస్తూ నిఖిల్ అనే యువకుడు గస్తీ నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ బాలనరసింహులు, జనార్ధన్, వెంకటేశ్‌నాయక్‌కు పట్టుపడ్డాడు. దీంతో నిఖిల్‌ను పీఎస్‌కు తరలించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న నిఖిల్‌కు వరసకు అన్న అయిన శివశంకర్... పీఎస్‌కు చేరుకుని పోలీసు సిబ్బందిని దుర్భాషలాడాడు. అంతేకాక తన తమ్ముడిని స్టేషన్‌కు పట్టుకెళ్లిన వారు మండలంలో ఎలా తిరుగుతారో తాను చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో హెడ్‌కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిఖిల్, శివశంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు: మండలంలోని వెంకటాంపల్లిలో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రఽథోత్సవంలో భాగంగా గురువారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. దాదాపు 9 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లికి చెందిన రైతు ఇంద్రారెడ్డి వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. రెండో స్థానాన్ని తాడిపత్రికి చెందిన రైతు రాజశేఖర్‌రెడ్డి వృషభాలు, మూడో స్థానాన్ని పెద్దవడుగూరు మండలం లక్షుంపల్లికి చెందిన రైతు శివారెడ్డి వృషభాలు, నాల్గో స్థానాన్ని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డి.రంగాపురం గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి వృషభాలు దక్కించుకున్నాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు.
ఆటోను ఢీకొన్న కారు
Comments
Please login to add a commentAdd a comment