మామిడి రైతులకు ఫ్రూట్ కవర్ రాయితీలు
అనంతపురం అగ్రికల్చర్: నాణ్యమైన మామిడి దిగుబడుల కోసం ఇటీవల కొత్తగా రాయితీతో అందిస్తున్న ఫ్రూట్ కవర్ల (రక్షణ కవచం)ను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు సూచించారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీపై గురువారం అనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో మామిడి రైతులతో పాటు ఎఫ్‌పీఓలు, ఎన్‌జీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మామిడితోటల్లో కాయలు నిమ్మకాయ, కోడిగుడ్డు సైజులో ఉన్నప్పుడు గాలిచొరబడకుండా తొడిమ వరకు కవర్లు కట్టాలని తెలిపారు. ఫ్రూట్ కవర్ వాడటం వల్ల ఊజీ ఈగ, తేనెమంచు పురుగు, మచ్చలు, తామర పురుగుల నుంచి రక్షణ ఉంటుందన్నారు. అలాగే అధిక సూర్యరశ్మి, వడగండ్ల వాన నుంచి కూడా కాపాడుకోవచ్చన్నారు. ఎలాంటి క్రిమికీటకాలు పండ్లను నాశనం చేయకుండా నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని తెలిపారు. తొడిమ కూడా ధృఢంగా తయారై కాయ పరిమాణం కూడా పెరుగుతుందన్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా 50 శాతం రాయితీతో గరిష్టంగా ఒక హెక్టారుకు రూ.10 వేలు వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. ఎఫ్‌పీఓలు, ఎన్‌జీఓలు సహకరిస్తే మామిడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఏఎఫ్ ఎకాలజీ, కార్డు, జీటీ, రెడ్స్, ఏపీమాస్ తదితర ఎన్‌జీఓ, ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
శిక్షణా కార్యక్రమంలో
డీహెచ్‌ఓ నరసింహారావు
Comments
Please login to add a commentAdd a comment