నిరుద్యోగులపై ‘కూటమి’ కపటప్రేమ
అనంతపురం అర్బన్: రాష్ట్రంలోని నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్‌కుమార్ మండిపడ్డారు. ఇప్పటికై నా ఈ తరహా నాటకాలకు స్వస్తి చెప్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తవుతున్నా నిరుద్యోగ యువతకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. హామీలను నెరవేర్చకుండా యువతను మాటలతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ చర్యలను ఇక సహించేది లేదన్నారు. అమరావతిని ఫ్రీజోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగ నియమాకాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు సమాన అవకాశం కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఇతర శాఖల్లో ఖాళీ పోస్టులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయాలన్నారు. వలంటీర్ వ్యవస్థను కొనసాగించి రూ.10 వేలు గౌరవవేతనం ఇవ్వాలన్నారు. ఇలా మొత్తం 32 తీర్మానాలను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నామన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్రేష్, ఉపాధ్యక్షుడు దేవేంద్ర, సహాయ కార్యదర్శి ధనుంజయ, కోశాధికారి శ్రీనివాస్, ఉరవకొండ మండల కార్యదర్శి నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment