
ఈ సారి రేషన్‌కార్డులు, పెన్షన్లలో భారీగా కోత!
ఉమ్మడి జిల్లాలో ఇంటింటి సర్వేకి చంద్రబాబు సర్కారు శ్రీకారం
ఫ్రిజ్‌లు, ఏసీలు ఉంటే పక్కాగా నమోదు చేయాలని ఆదేశాలు
కరెంటు బిల్లులు, సొంతిళ్లు, కారు వివరాలు కూడా సేకరణ
ఇప్పటికే వైకల్య సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో పింఛన్ల కట్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల వేళ ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సంపద సృష్టిస్తా.. ఆ సంపదను పేదలకు పంచుతా.. రైతులు పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసి, ఆ తర్వాత వాడుకోగా మిగిలింది గవర్నమెంటుకు సప్లై చేసే విధంగా చేస్తా’ అంటూ అప్పట్లో లేనిపోని గొప్పలు చెప్పిన బాబు.. ఇప్పుడు పెన్షన్లు, రేషన్ తదితర ప్రభుత్వ పథకాలకు కోత వేసేలా పావులు కదుపుతుండటంపై అన్ని వర్గాలు పెదవి విరుస్తున్నాయి.
భారీగా ఆంక్షలు..
ఉమ్మడి జిల్ల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టేలా చంద్రబాబు ప్రభుత్వం సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంటింటి సర్వేలో ప్రభుత్వ పథకాల అర్హతకు భారీగానే ఆంక్షలు విధించనున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటే వెంటనే ఆ ఇంట్లో వారికి వచ్చే పెన్షన్, రేషన్ కట్‌చేసేలా సర్వే నిర్వహిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంటికీ రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) ఉంది. ఇప్పుడు ఇది కూడా ఆంక్షల జాబితాలోకి వచ్చింది. కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి, ఫ్రిజ్ ఉందంటే కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక కారు, సొంతిళ్లు, భూములు, స్థలాలు కూడా ఆంక్షల జాబితాలో చేరుతున్నాయి. పైన నిర్ణయించిన వాటిలో ఏవైనా ప్రభుత్వ పథకానికి అడ్డంకిగా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఏవి ఉన్నా హోల్డ్..!
గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముందుగా అర్బన్ ఏరియాల్లో కార్యదర్శులకు ఈనెల 19న శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే ఇళ్లన్నీ జియోట్యాగింగ్‌లో ఉన్నాయి. ఆయా ఇళ్లకు వెళ్లి గత నెల వచ్చిన కరెంటు బిల్లుతో పాటు ఫ్రిజ్ ఉందా, ఏసీ ఉందా వంటివన్నీ పరిశీలించి నమోదు చేస్తారు. ముందుగా మున్సిపాలిటీల పరిధిలో పూర్తయ్యాక, తర్వాత గ్రామీణ ప్రాంతా ల్లో సర్వే నిర్వహిస్తారని, ఆయా వస్తువుల్లో ఏవి ఉన్నాయని తేలినా పథకాలు హోల్డ్‌లో పెడతారని చెబుతున్నారు.
వైకల్య బాధితులనూ వదల్లేదు..
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైకల్య బాధితులను కూటమి సర్కారు ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే జిల్లాలో వేలాది పెన్షన్లకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లుగా వైకల్య పెన్షన్ తీసుకుంటున్న వారికి మళ్లీ ఇప్పుడు కొత్తగా పరీక్షలు చేస్తామని చెప్పింది. దీంతో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో ఉన్న 36 వేల మంది లబ్ధిదారులు అనంతపురం రావాల్సి వస్తోంది. డాక్టర్లు ఇక్కడే ఉండటంతో 130 కిలోమీటర్ల నుంచి కూడా అవస్థలు పడుతూ వస్తున్నారు. తాజాగా సదరం వెరిఫికేషన్‌లో సుమారు 30 శాతం పింఛన్లకు కోత వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సకాలంలో మోడల్ సర్వే
అనంతపురం అర్బన్: పీ4 మోడల్ సర్వే సకాలంలో చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 మోడల్ సర్వేపై కలెక్టర్లతో సీఎస్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆరోఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామన్నారు. సర్వే మొదటి దశ గురువారం జిల్లాలో ప్రారంభమైందని, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను భాగస్వాముల్ని చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment