ఒత్తిడికి గురి కావొద్దు.. పరీక్షలు బాగా రాయండి
● విద్యార్థులకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన కలెక్టర్
అనంతపురం ఎడ్యుకేషన్: ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ‘ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష హాలులోకి వెళ్లండి. ప్రశ్నపత్రాన్ని బాగా చదవండి. ప్రశ్నలు ఎన్ని వస్తాయో...ఎన్ని రావో చూసుకోండి. ముందుగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసే ప్రయత్నం చేయండి. వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లండి. అద్భుతమైన కలలు కనండి. నోస్ట్రెస్...గివ్ యువర్ బెస్ట్...ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్...మీ కలెక్టర్’ అంటూ పేర్కొన్నారు.
చట్టాలపై అవగాహన
కలిగి ఉండాలి
గార్లదిన్నె: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శివప్రసాద్ యాదవ్ సూచించారు. గురువారం మండల పరిధిలోని కేకే తండా గ్రామంలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న నిర్భాగ్యులకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో 7 రోజులు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తారన్నారు. అలాగే వారి సమస్య పరిష్కరించుకునే మార్గాలు, ఉచిత న్యాయ సహాయం కూడా పొందవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ నేరమన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ దామోదరమ్మ, ఎంఈఓ చంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సబ్ జైలు తనిఖీ
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని సబ్ జైలును గురువారం న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శివప్రసాద్ యాదవ్ శివ ప్రసాద్ యాదవ్ తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. బాల నేరస్తులు ఉన్నారా అని ఆరా తీశారు. అనంతరం వంట గది, స్టోర్ రూమ్, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో లాయర్ దాదా ఖలందర్, చలపతి, జైల్ సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, పారా లీగల్ వలంటీర్ అనిత, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అప్పుల బాధతో
రైతు ఆత్మహత్య
గార్లదిన్నె: మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు సదాశివారెడ్డి (65) తన 15 ఎకరాల భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ ఆయకం పెట్టాడు. దాదాపు రూ.20 లక్షల అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలని ఇంట్లో రోజూ మదన పడుతుండేవాడు. ఈ నెల 14వ తేదీన పెనకచెర్ల గ్రామ సమీపంలో పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా పేర్కొన్నారు.
కరువు మండలాల్లో
ఉపాధి పనిదినాల పెంపు
అనంతపురం టౌన్: కరువు మండలాల్లో ఉపాధి పనిదినాలను పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇటీవలే కేంద్ర కరువు బృందాలు పర్యటించి 7 మండలాలను(అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, నార్పల, రాప్తాడు, విడపనకల్లు, యాడికి) కరువు ప్రాంతాలుగా ప్రకటించాయన్నారు. ఆయా మండలాల్లో ఉపాధి పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచినట్లు తెలిపారు. 100 రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలు సైతం అదనంగా మరో 50 రోజులు హాజరు కావొచ్చన్నారు.
ఒత్తిడికి గురి కావొద్దు.. పరీక్షలు బాగా రాయండి
Comments
Please login to add a commentAdd a comment