రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటా?
అనంతపురం కార్పొరేషన్: రైతుల కష్టాలు తెలుసుకుని.. వారికి బాసటగా నిలిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లీగల్ యాక్టివిటీ అంటూ వ్యాఖ్యానించడాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తప్పు పట్టారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను పరామర్శిస్తే మాజీ సీఎంతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ నుంచి పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. విత్తనాలు, ఎరువులు, తదితర ధరలు పెరగడంతో పాటు కంది, శనగ, మొక్కజొన్న, ధాన్యం, రాగులు, పత్తి, అరటి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. గిట్టుబాటు ధర లభించకపోతే పోటీ మార్కెట్‌ను తీసుకురావాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. గతంలో 24 పంటలకు గిట్టుబాటు ధర లభించకపోతే అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా తీసుకున్న చర్యలను ఆయన గుర్తు చేశారు. పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించకపోతే తర్వాత జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ప్రభుత్వ తీరు దారుణం
మిర్చి రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అనంత మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఒక మాజీ సీఎంకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో మాజీ సీఎం వెళితే అక్కడ ఆయనకొచ్చిన విశేషమైన ప్రజాదరణను ఓర్వలేక సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులు విమర్శలు చేయడం సరికాదన్నారు.
రైతుల భూములు వేలం వేస్తారట!
అనంతపురం జిల్లాలో సెంట్రల్ బ్యాంకులు రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేయడం విస్మయానికి గురి చేస్తోందని అనంత పేర్కొన్నారు. బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించి భారీ మొత్తంలో చెల్లించాలంటూ అధికారులు పంపిన నోటీసును ఆయన విలేకరులకు చూపించారు. వన్‌టైం సెటిల్‌మెంట్ కూడా లేకుండా డబ్బులు కట్టకపోతే భూములు వేలం వేస్తామని రైతులకు నోటీసులు పంపడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
చిన్న పాపపై ట్రోల్ చేయడం ఏంటి?
అభిమానంతో ఓ చిన్నారి మాజీ సీఎం వైఎస్ జగన్‌వద్దకు వెళ్లి అమ్మఒడి ప్రస్తావన తెస్తే దాన్ని టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేయడాన్ని అనంత వెంకటరామిరెడ్డి తప్పుబట్టారు. ఇంత కన్నా దిగుజారుడు రాజకీయాలు ఎక్కడా చూడలేదన్నారు. టీడీపీ సైకోల వికృత చేష్టలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. తెనాలిలో జగనన్న కాలనీలో పట్టా అందుకున్న మహిళ తన ఆనందాన్ని పంచుకుంటే.. అప్పట్లోనే టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా వేధింపులకు గురి చేయడంతో.. ఆమె ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, గోగుల రాధాకృష్ణ, అమర్‌నాథ్‌రెడ్డి, పుల్లయ్య, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలం
ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment