డ్రిప్‌ లక్ష్యం పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

డ్రిప్‌ లక్ష్యం పూర్తి చేయాలి

Published Sat, Feb 22 2025 2:16 AM | Last Updated on Sat, Feb 22 2025 2:12 AM

డ్రిప

డ్రిప్‌ లక్ష్యం పూర్తి చేయాలి

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాకు నిర్ధేశించిన 18 వేల హెక్టార్ల డ్రిప్‌, స్ప్రింక్లర్ల లక్ష్యాన్ని మార్చి 20 లోపు పూర్తి చేయాలని ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) ఆఫీసర్‌ అన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ– టెక్నికల్‌) డాక్టర్‌ చేరెడ్డి పుల్లారెడ్డి ఆదేశించారు. స్ప్రింక్లర్‌ యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి తనిఖీ నిమిత్తం అనంతపురం వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం ఏపీఎంఐపీ కార్యాలయంలో పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ జి.ఫిరోజ్‌ఖాన్‌, సూపరెండెండెంట్‌ వరప్రసాద్‌తో సమావేశమై ప్రాజెక్టు పనితీరు, సమస్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా అనంతపురానికే అధిక కేటాయింపులు ఉన్నాయన్నారు. ఇందుకు తగ్గట్లుగా సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు పరికరాలు అందిస్తున్నామన్నారు. వచ్చే 2025–26 నుంచి విధి విధానాలు, ప్రోత్సాహక రాయితీల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు 100 శాతం రాయితీ అవకాశం ఉంటుందేమో వేచి చూడాలన్నారు.

28న సైన్స్‌ సంబరాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జాతీయ సైన్స్‌ డే సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైన్సు సంబరాలు నిర్వహించి విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించాలని డీఈఓ ప్రసాద్‌ బాబు అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌, స్మార్ట్‌ టీవీలను వినియోగించుకొని ప్రఖ్యాత శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, వారు ప్రపంచానికి అందించిన ఆవిష్కరణలు, ఇస్రో సాధించిన విజయాలను విద్యార్థులకు చూపించి వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు. ‘సైన్స్‌ క్విజ్‌, ‘పాఠశాల స్థాయి సైన్స్‌ ఫెయిర్‌’, ‘సైన్స్‌ నాటికలు నిర్వహించాలన్నారు. ‘ప్రపంచ గతిని మార్చిన సైన్స్‌ అవిష్కరణలు’ అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని సైన్స్‌, మ్యాథ్స్‌ ఉపాధ్యాయులు సైన్స్‌ డేలో పాల్గొనాలని ఆదేశించారు.

ఆ ఉద్యోగుల బదిలీలు రద్దు

అనంతపురం టౌన్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో పలువురు అధికారులు, ఉద్యోగుల బదిలీలు రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో అనంతపురం రామ్‌నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ యూనస్‌, రాయదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసులు, పెనుకొండ సబ్‌ రిజిస్ట్రారు వెంకటనాయుడు, సీనియర్‌ అసిస్టెంట్లు జయదీప్‌, శ్రీనివాసరెడ్డి తదితరులను డిప్యుటేషన్‌పై విజయవాడలోని ఐజీ కార్యాలయానికి రెండు రోజుల క్రితం బదిలీ చేశారు. అయితే బదిలీ ఉత్తర్వుల్లో 45 సంవత్సరాలలోపు వయస్సు నిబంధనతోపాటు డైరెక్టు రిక్రూట్‌ అయి ఉండాలనే నిబంధనలు ఉండడంతో వారందరూ బదిలీకి అనర్హులుగా గుర్తించి ఐజీ కార్యాలయ అధికారులు జాయినింగ్‌ ఆర్డర్లు ఇవ్వకుండా వెనక్కు పంపారు. వీరందరిని తిరిగి వారి స్థానాలకు కేటాయించనున్నట్లు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ విజయలక్ష్మి తెలిపారు.

మద్యం మత్తులో రైలింజన్‌ ఎక్కి..

గుత్తి: మద్యం మత్తులో ఓ యువకుడు తానేమి చేస్తున్నాడో తెలియని స్థితిలో విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.... తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన సలీం మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరిగేవాడు. ఫుల్‌గా మద్యం సేవించి రైలు ఎక్కి ఎక్కడ పడితే అక్కడ దిగేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున మద్యం మత్తులో గుత్తి రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫారం–1కి చేరుకున్నాడు. తన వైపుగా వస్తున్న రైల్వే పోలీసులను గమనించి వెంటనే పక్కనే ఉన్న గూడ్స్‌ రైలు ఇంజిన్‌పైకి ఎక్కాడు. పైనున్న విద్యుత్‌ లైన్‌ తగిలి షాక్‌కు గురై గాయపడ్డాడు. వీపు భాగం కాలిపోయింది. క్షతగాత్రుడిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డ్రిప్‌ లక్ష్యం పూర్తి చేయాలి1
1/1

డ్రిప్‌ లక్ష్యం పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement