వధువు తరఫు డిమాండ్లివీ..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కాలం ఎప్పుడూ ఒకరిదే ఉండదు.. మాకంటూ ఒకరోజు వస్తుంది.. ఇది తరచూ వినే నానుడి. ఇప్పుడీ మాట అమ్మాయిలకు సరిగ్గా సరిపోతుంది. సరైన అబ్బాయి దొరక్క, దొరికిన అబ్బాయికి కట్నమిచ్చుకోలేక నానా తంటాలు పడే అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు పైచేయి సాధించారు. మాకు ఇలాంటి అబ్బాయే కావాలి, మాకు నచ్చినట్టే ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి.. అంటూ గట్టిగా, సూటిగా చెబుతుండటంతో అబ్బాయిల మైండ్ బ్లాక్ అయినంత పనవుతోంది. ఓవైపు వయసు మీద పడుతున్నా అమ్మాయి దొరక్క అబ్బాయిలు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. వధువుల డిమాండ్లతో అబ్బాయిలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మాఘమాసం వచ్చినా...
మాఘమాసంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పెళ్లిళ్లు జరిగేవి. అమ్మాయిల తాజా డిమాండ్లతో అబ్బాయిలకు పెళ్లి ఒక పట్టాన అవడం లేదు. మ్యాట్రిమోని సంస్థలు, మ్యారేజీ బ్రోకర్లు, పేరయ్యలు, తెలిసిన వాళ్లు ఇలా ఎంతమందికి చెప్పినా అబ్బాయికి జోడీ దొరకడం కష్టమవుతోంది. నూరు అబద్ధాలాడైనా పెళ్లి చేయాలంటారు.. కానీ నూరు నిజాలు కుండబద్దలు కొట్టి అయినా సరే సరిజోడీ తెచ్చుకుంటాం అని అమ్మాయిలు ధైర్యంగా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి.
వధువుల డిమాండ్ల జాబితా చాంతాడంత
మంచి ప్యాకేజీతో ఉద్యోగం.. పొలమూ ఉండాలి
డిమాండ్లకు సరితూగక ముందుకు సాగని పెళ్లిళ్లు
మాఘ మాసంలోనూ అంతంతమాత్రంగానే వివాహాలు
నెలకు రూ.లక్ష దాకా జీతం ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి.
మంచి ప్యాకేజీ, సొంత ఇళ్లు ఉన్నా.. కొద్దో గొప్పో పొలం ఉండాలి.
రెండుమూడేళ్ల కంటే వయసు గ్యాప్ ఉండరాదు. బట్టతల ఉంటే ఒప్పుకోం.
ఉమ్మడి కుటుంబంలో ఉంటే గనుక ఇబ్బంది. పెళ్లవగానే వేరే కాపురం పెట్టాలి.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులుంటే వాళ్లకు మేము సేవలు చేయలేం.
ఆడపడుచులు ఎక్కువగా ఉన్న కుటుంబంలో వరుడైతే వద్దు.
మేము ఎలాంటి నగదూ ఇవ్వలేం.. మా పిల్ల వరకూ బంగారం చేయించుకుంటాం.
ఉమ్మడి ఆస్తులుంటే ఎంగేజిమెంటు అవగానే నీ పేరుమీదకు బదిలీ చేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment