అనంతపురం: కూటమి ప్రభుత్వ తీరుతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు డోలాయమానంలో పడ్డాయి. ఎంతో సౌలభ్యంగా ఉన్న ‘ఆప్కాస్’ను రద్దు చేసి ప్రైవేటుకు అవుట్‌సోర్సింగ్ విధానాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జేఎన్‌టీయూ అనంతపురం వర్సిటీని 2008లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అప్పట్లోనే అవుట్‌సోర్సింగ్ కింద 400 మందికి ఉద్యోగాలు కల్పించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆప్కాస్ కిందకు అవుట్‌సోర్సింగ్ వారిని తెచ్చి.. జీతాలు నేరుగా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఆప్కాస్‌ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాలని ఇటీవల కూటమి సర్కారు నిర్ణయించడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో అభద్రత నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల స్థానంలో తమ అనుచరులను నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు నేరుగా సీఎంకు లేఖలు రాస్తుండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఆప్కాస్‌ను రద్దు చేస్తే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీల నిర్వహణలో సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు పడిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు.
ఉద్యమాలకు కార్యాచరణ..
జేఎన్‌టీయూ అనంతపురం ఉద్యోగులపై కొందరి ప్రజా ప్రతినిధుల కన్ను పడినట్లు తెలిసింది. ఏజెన్సీనే తమకు అప్పగించాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే ఆప్కాస్‌ను రద్దు చేయాలని మంత్రి వర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించారు. జీఓ నంబర్ 2ను సవరించి అన్ని డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలనే డిమాండ్లతో ఈ నెల 24న సీఎం, విద్యాశాఖ మంత్రికి మెయిల్స్ ద్వారా వినతిపత్రాలు పంపనున్నారు. మార్చి 10న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
జీతాలు కూడా లేవు..
గత ఏడాది అక్టోబర్ వరకు జేఎన్‌టీయూ అనంతపురం (జేఎన్‌టీయూ–ఏ) అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ నుంచి జీతాలు అందాయి. ఆ తర్వాత జీతాలు చెల్లించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఏజెన్సీకి అప్పగించిన అనంతరమే జీతాలు ఇస్తారా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
ఆప్కాస్‌తో ఉద్యోగ భద్రత:
చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆప్కాస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఈ వ్యవస్థ కిందకు తెచ్చి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించేది. ఈఎస్‌ఐ, పీఎఫ్ వెసులుబాటు కల్పించింది. ఆప్కాస్‌లో విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించాలంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. మూడు సార్లు షోకాజ్ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సదరు ఉద్యోగి ఇచ్చే జవాబు సంతృప్తికరంగా ఉన్నట్లయితే ఆ ఉద్యోగిని కొనసాగించాల్సి ఉంటుంది. ఆప్కాస్ కాకుండా ఏజెన్సీ ద్వారా ఇస్తే జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు.
‘ఆప్కాస్’ రద్దు యోచనలో సర్కారు
తమ అనుయాయులను నియమించాలని ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
ప్రైవేట్‌కు అప్పగిస్తే
నష్టపోతామంటున్న చిరుద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment