నమ్మి ఓటేస్తే.. రైతుల నోట మట్టి కొడతారా?
రాప్తాడు రూరల్: నమ్మి ఓబేసిన పాపానికి జిల్లా రైతుల నోట కూటమి సర్కార్ మట్టి కొడుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలని పార్టీలకు అతీతంగా రైతులు స్పందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులను అడ్డుకుంటున్నారన్నారు. కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేస్తే దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ జలాలు అడుగంటి పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బోర్లు ఎండిపోయి రైతులు వలస వెళ్లే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయంగా గతంలో పలు విజ్ఞప్తులు చేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతు సంక్షేమానికి పార్టీలకు అతీతంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నేతలు, రైతు సంఘాలు, రైతు కూలీలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఇందు కోసం శనివారం నుంచి హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అఖిల పక్ష నేతలతో చర్చించి, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. లైనింగ్ పనులను అడ్డుకునేందుకు ఎవరు వచ్చినా కలుపుకొని పోరాటాలు చేస్తామన్నారు. శ్రీశైలం డ్యాంలో 80 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నాయని, రోజూ సగటున ఇరు రాష్ట్రాలు అర టీఎంసీ మాత్రమే డ్రా చేస్తున్నాయన్నారు. ఈ లెక్కన మరో ఐదు నెలల వరకు వాడుకోవచ్చన్నారు. ఈ లోపు మడకశిర బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న చెరువులు, పేరూరు డ్యాంకు కూడా నీరు ఇవ్వొచ్చన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో అర్తం కావడం లేదన్నారు. పెన్నానదిలో ఇసుకను తోడుకునే విషయంలో ఉన్న ఉత్సాహం పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడంలో పరిటాల సునీత చూపించడం లేదన్నారు. తన నియోజవకర్గంలో చెరువులకు నీళ్లివ్వాలని అడగాల్సిన పెద్దమనిషి బాలకృష్ణ సైతం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి తిరుగుతున్నారన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు తెచ్చుకునే విషయలో మంత్రి సవితమ్మ మాట్లాడాలన్నారు. కొత్తగా వచ్చిన ఎంఎస్ రాజు మడకశిర నియోజకవర్గంలోని అగళి, అమరాపురం డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసేందుకు రూ. 200 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టుకునేందుకు ప్రయత్నించాలన్నారు. జిల్లా రైతులను కాదని చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోవాలని చూస్తే అడ్డుకుంటామన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ను అనంతపురం, కర్నూలు జిల్లాలకే పరిమితం చేయాలన్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సైతం దీనిపై స్పందించాలన్నారు. మైక్రో ఇరిగేషన్ లేదా పిల్లకాలువల నిర్మాణాలు పూర్తయిన తర్వాత లైనింగ్ పనులు చేసుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రామగిరి మండల కన్వీనర్ మీనుగ నాగరాజు, నాయకులు ఆదిరెడ్డి, మదిగుబ్బ వీరాంజనేయులు పాల్గొన్నారు.
జిల్లా రైతులను కాదని చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకెళతామంటే ఒప్పుకోం
పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకు రావడంలో ఎమ్మెల్యే సునీత వైఫల్యం
నేటి నుంచి గ్రామాల పర్యటన
అఖిల పక్ష నేతలతో చర్చించి లైనింగ్ పనులు అడ్డుకుంటాం
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment