గవర్నర్‌తోనే అసత్యాలు చెప్పిస్తారా?
● గత ప్రభుత్వ మేలునూ కూటమి ఖాతాలోకి వేస్తే ఎలా?
● సీఎం చంద్రబాబు తీరు దారుణం
● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
అనంతపురం కార్పొరేషన్: ‘గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు రూ.లక్షల కోట్ల సంక్షేమం అందింది. కానీ, నేటి కూటమి ప్రభుత్వం మాత్రం ఆ క్రెడిట్ తమదేనన్న చందంగా అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తో అసత్యాలు చెప్పించడం ఎంత వరకూ సమంజసం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. సోమవారం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు పాలనపై పట్టు లేదని గవర్నర్‌తో చెప్పించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక పేర్చలేదని, సెంటు భూమి కూడా ప్రజలకు పంచలేదని, అయినా 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొరవతో లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ సర్కార్‌లో రైతులకు అడుగడుగునా ప్రోత్సాహం లభిస్తే.. నేడు సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించు కోవడం లేదన్నారు. కరెంటు చార్జీలతో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ‘సూపర్ సిక్స్’లో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. శాంతిభద్రతల వైఫల్యంతో రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదన్నారు. విశాఖస్టీల్‌ప్లాంట్‌ను బతికించాలని కోరారు. సీఎం చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలతో వైద్య రంగం నిర్వీర్యమైందన్నారు. పులివెందుల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వైద్య కళాశాలలు వద్దని ఇప్పటికే కూటమి సర్కారు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 15 వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలోకి తీసుకెళ్లాలని చూడటం దారుణమన్నారు. ఆరోగ్య శ్రీ పథకం లేకుండా చేయాలనే దుష్ట తలంపుతో బీమా సంస్థలకు అప్పగించాలనుకోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శాసన సభను హుందాగా నడిపించాల్సిన బాధ్యత సభా నాయకుడైన సీఎం చంద్రబాబుపై ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు. కానీ, ప్రధాన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసుకోకుండా సమావేశాల్లో సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించి, ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి జిల్లాకు మేలు చేసేలా మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ చూపాలన్నారు.
సవాల్ స్వీకరించాలి..
‘సూపర్ సిక్స్’లో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చుతామని సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులు చెప్పగలరా అని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య సవాల్ విసిరారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 96 శాతం పథకాలు అమలు చేశామన్నారు. కూటమి సర్కారు ఏర్పాటయ్యాక మంచి ప్రభుత్వమంటూ స్టిక్కర్లు వేసుకున్నారని, ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం ఏవిధంగా మంచిదవుతుందని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment