ఆదిదేవా.. శరణు
తాడిపత్రి రూరల్: పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం ఆదిదేవుడు నరమృగ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వరస్వామిని అర్చకులు విశేషంగా అలంకరించారు. నరమృగ వాహనంపై పురవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు.
మొక్కల పెంపకంతోనే ఇసుక దిబ్బలకు అడ్డుకట్ట
కణేకల్లు/బొమ్మనహళ్: మొక్కలను విరివిగా పెంచడం ద్వారా ఇసుక దిబ్బల విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చని జీఐజెడ్ (ఎడారి నివారణకు కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ) నిపుణుల బృందం సభ్యులు హర్షడోరియా(న్యూఢిల్లీ), ఓంప్రకాష్ పారిహర్ (రాజస్థాన్), స్టేట్ కో–ఆర్డినేటర్ సంతోష్ పేర్కొన్నారు. కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లోని తుంబిగనూరు, గరుడచేడు, మీన్లహళ్లి, బిదరకుంతం, దర్గాహొన్నూరు గ్రామాల్లో వేదవతి హగరి నది ఒడ్డున వేలాది ఎకరాల్లో విస్తరించిన ఇసుక దిబ్బలను సోమవారం వారు పరిశీలించారు. ఇసుక దిబ్బలు మరింత విస్తరించకుండా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో చర్చించారు. ఈ భూముల్లో కర్జూరపు పంట సాగు సత్ఫలితాలను ఇస్తుందన్నారు. ఇసుక దిబ్బలు విస్తరించకుండా సరుగుడు, రేగు, గోరింటాకు చెట్లను నాటాలన్నారు. ఇసుకను వేరే ప్రాంతాలకు తరలించి, ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. దీనిపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కణేకల్లు, బొమ్మనహాళ్ ఏపీఓలు సుధాకర్, రమేష్, ఏపీడీ అసిస్టెంట్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ అందించండి
అనంతపురం: రెండు నెలల నుంచి పెన్షన్ అందడం లేదని ఎస్కేయూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు వాపోయారు. ఈ మేరకు సోమవారం ఎస్కేయూ రిజిస్ట్రార్ రమేష్ బాబుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో పెన్షన్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పెన్షన్ ఎప్పుడు వస్తుందో.. రాదో తెలియని అయోమయం నెలకొందన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ అన్ని వర్సిటీల్లోని రిటైర్డ్ ఉద్యోగులకు రూ.300 కోట్ల పెన్షన్ నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ పూర్తయిన తరువాతే నిధులు వస్తాయని చెప్పారు. దీంతో మార్చి వరకు పెన్షన్ రాదని తెలియడంతో రిటైర్డ్ ఉద్యోగులు నిరాశగా వెళ్లిపోయారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూరి, కార్యదర్శి నాగన్న, నాయకులు ఆర్.కేశవ రెడ్డి, పెద్దిరెడ్డి, వెంకట్రాముడు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
ఆదిదేవా.. శరణు
Comments
Please login to add a commentAdd a comment