పప్పుశనగ రైతులకు కుచ్చుటోపీ
బెళుగుప్ప: పప్పుశనగ రైతులకు ఓ వ్యాపారి కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన మళ్లెమల విక్రమ్‌కు పలు గ్రామాలకు చెందిన రైతులు పంటల దిగుబడులు ఇచ్చేవారు. తగ్గుపర్తి వద్ద శివసాయి వేర్‌హౌస్‌కు దిగుబడులను విక్రమ్ తరలించేవాడు. అయితే గత ఏడాది గుట్టు చప్పుడు కాకుండా పప్పుశనగ నిల్వలను తెగనమ్మిన విక్రమ్.. రైతులకు డబ్బు మాత్రం చెల్లించలేదు. దీనిపై అడిగితే అదిగో ఇదిగో అంటూ రైతులను మభ్యపెట్టేవాడు. ఈ క్రమంలోనే బెళుగుప్ప నుంచి తొలుత బళ్లారికి మకాం మార్చాడు. ఇటీవల బళ్లారి నుంచి కూడా పరారయ్యాడు. పంట దిగుబడులు ఇచ్చిన రైతులకు కోర్టు నోటీసులను పంపాడు. దీంతో 30 మంది విక్రమ్ బాధిత రైతులు సోమవారం పోలీసుస్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ శివకు ఫిర్యాదు చేశారు. తమకు సుమారు రూ.5 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని వాపోయారు. వేర్‌హౌస్ వద్దకు వెళ్లి ఆరా తీస్తే విక్రమ్ తన వాటాను అమ్ముకుని వెళ్లాడని చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ శివ మాట్లాడుతూ పూర్తిస్థాయి విచారణ చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment