చిన్న సమస్యలూ పెద్ద సార్ల వద్దకు!
అనంతపురం అర్బన్: పంచాయతీ, మునిసిపల్, మండల స్థాయిల్లోనే పరిష్కారం కావాల్సిన చిన్న చిన్న సమస్యలకూ మోక్షం లభించ లేదు. దీంతో పెద్దసార్లకైనా విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందేమోననే గంపెడాశతో వ్యయ ప్రయాసలకోర్చి అర్జీదారులు తరలివచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 502 వినతులు అందాయి. ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జునలు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించడంతో పాటు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని..
● మాజీ సైనికుల కోటా కింద బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామ సర్వే నంబరు 114–ఎ1లో తనకు మంజూరైన ఐదెకరాల పొలానికి డీ పట్టా ఇవ్వడం లేదని పరమేశ్వరప్ప ఫిర్యాదు చేశాడు. విచారణ చేసి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
● విద్యాశాఖలో బోధనేతర విధులు నిర్వర్తిస్తున్న బోధన సిబ్బందిని తొలగించాలని రిజర్వేషన్ పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.ఉజ్వల్ విన్నవించాడు. పలువురు ఉపాధ్యాయులు చాలా సంవత్సరాలుగా డీఈఓ, సమగ్రశిక్ష తదితర కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారని, పాఠశాలల్లో వేతనం తీసుకుంటూ విద్యార్థులకు చదువు చెప్పడం లేదని, సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరాడు.
● కూడేరు మండలం కడదరకుంట సర్వే నంబరు 27–1లో ఎస్సీ వర్గానికి చెందిన కొక్కమారెప్పకు అసైన్డ్ చేసిన 10.99 ఎకరాలను ఓ వ్యక్తి చట్టవిరుద్ధంగా ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నెరమెట్ల ఎల్లన్న ఆధ్వర్యంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైన వారికి న్యాయం చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
● ఉరవకొండ మండలం వై.రామాపురం సర్వే నంబరు 341–డీలోని తన భూమి సర్వే కోసం గత నెల 23న చలానా కట్టానని, జిల్లా సర్వేయర్‌ను పంపించి సమస్య పరిష్కరించాలని పి.మాబు విజ్ఞప్తి చేశాడు.
● ఇతని పేరు వన్నూరుసాబ్. అనంతపురం నగర పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్నాడు. కాలనీలో ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకున్న బట్టీ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వన్నూరుసాబ్ చెప్పాడు. బట్టీలోకి పాతటైర్లు, టెంకాయచిప్పలు, కుళ్లిన కొబ్బరి, చెత్తా చెదారం వేసి నిప్పు పెడుతుండటంతో పొగ
వెలువడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, తగిన పరిష్కారం చూపాలని ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అధికారులను వేడుకున్నాడు.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు పోటెత్తిన అర్జీలు
చిన్న సమస్యలూ పెద్ద సార్ల వద్దకు!
Comments
Please login to add a commentAdd a comment