బైక్ ఢీకొని యువకుడి మృతి
బొమ్మనహాళ్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన తలారి హనుమంతు, పార్వతి దంపతుల కుమారుడు లోకేష్ (35)కు ఏడేళ్ల క్రితం కల్లుహోళ గ్రామానికి చెందిన అంజలితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతూరిలోనే ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న లోకేష్ బుధవారం వ్యక్తిగత పనిపై బొమ్మనహాళ్‌కు వచ్చాడు. పనిముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. నేమకల్లు చెక్‌పోస్టు దాటగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో లోకేష్‌కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు తమిళనాడుకు చెందిన రాజుకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజును కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. లోకేష్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు. కాగా, బాధిత కుటుంబసభ్యులను వైఎస్సార్‌సీపీ సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment