నాడు హామీలు... నేడు అరెస్టులా!
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ధ్వజం
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కూటమి నేతలు సిగ్గుపడాల్సిందిపోయి... వాటి గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అంగన్‌వాడీల అరెస్టులను నిరసిస్తూ నాయకులు, అంగన్‌వాడీలు సోమవారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు జిల్లా నుంచి బయలుదేరిన అంగన్‌వాడీలను వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌లో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అంగన్‌వాడీలకు వేతనం పెంచలేదన్నారు. చనిపోయాక మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.15వేలు చెల్లించేలా జీఓ ఇచ్చారన్నారు. సుప్రీం కోర్టు చెప్పినట్లుగా అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటే అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తీవ్రస్థాయిలో పోరాటాలు సాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రామాంజినేయులు, ముత్తూజా, వెంకటనారాయణ, నాగరాజు, ఎర్రిస్వామి, తిరుమలేషు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం నాయకురాళ్లు అరుణమ్మ, నక్షత్ర, రేవతి, పార్వతి, పద్మ, జ్యోతి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment