రైతులంటే అంత చులకనా?
అనంతపురం అర్బన్: రైతులంటే సీఎం చంద్రబాబుకు చులకనై పోయారని, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కనీసంగా కూడా రైతులకు చేసిన మేలు ఏమీ లేదని దుమ్మెత్తిపోశారు. మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, 2024–25 ఖరీఫ్, రబీలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం నాయకులు, రైతులు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు ఈ తొమ్మిది నెలల కాలంలో రైతులకు చేసిన మేలు ఏమిటో ఒక్కటైనా చెప్పాటని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. 2024–25 ఖరీఫ్, రబీలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతింటే ఈ రోజుకూ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఇదేనా రైతు సంక్షేమం అంటూ నిలదీశారు. ఇప్పటికై నా రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామని హెచ్చరిస్తూ కలెక్టర్ వినోద్‌కుమార్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రామిరెడ్డి, ఆర్‌వీనాయుడు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా నాయకులు శివారెడ్డి, విరుపాక్షి, మధసూదన్ నాయుడు, రాజారాంరెడ్డి, బీహెచ్‌రాయుడు, దస్తగిరి, చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది నెలలవుతున్నా పత్తాలేని పెట్టుబడి సాయం
ప్రహసనంలా మారిన ‘అన్నదాత సుఖీభవ’
పంటలకు గిట్టుబాటు ధర లేదు
కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment