గుడి.. గుడి స్థలం కూడా నాదే!
కళ్యాణదుర్గం రూరల్: ‘ఆలయం మా సొంతం. మాకన్నా దేవుడు గొప్ప కాదు. జాతరలో దుకాణం ఏర్పాటు చేయాలనుకునే వారు ఎవరైనా మా మాట వినాల్సిందే. మాకే డబ్బు చెల్లించాల్సిందే’ అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత డిష్ మురళి దౌర్జన్యాలకు తెరలేపాడు. వివరాలు... కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అక్కమాంబ దేవాలయం ఉంది. కొన్నేళ్లుగా ఈ ఆలయానికి ఒంటిమిద్ది, కురాకులతోట, దేవాదులకొండ గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేవాదులకొండ గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఏటా ఉగాది పండుగ అయిన మరుసటి రెండు రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో వందకు పైగా వివిధ రకాల దుకాణాలు ఏర్పాటవుతుంటాయి. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఉగాదికి ముందుగానే టెండర్లు నిర్వహించి దుకాణాల నిర్వహణకు సంబంధించి అనుమతులు జారీ చేస్తారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తుంటారు.
టీడీపీ నేత బరితెగింపు
ఈ ఏడాది టీడీపీ నేత డిష్ మురళి బరితెగించి ఆలయ ఆదాయ వనరుల దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో తిష్టవేసి ఉగాది తర్వాత దుకాణాలు నిర్వహించదలుచుకునే వారు తనకే డబ్బు చెల్లించాలని హుకుం జారీ చేశాడు. ఇదేమని పలువురు ప్రశ్నిస్తే ‘దేవుడికి ఇస్తే ఏమొస్తుంది. ఆలయం సొమ్మంతా మాదే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ మా మాటే వినాలి. లేకపోతే ఏ ఒక్కరూ ఇక్కడ దుకాణం పెట్టుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ‘గుడి మొత్తం నా స్థలంలోనే ఉంది. ఎక్కువగా మాట్లాడితే గుడి కూడా నాదే. ఎవ్వరేమీ చేసుకోలేరు’ అంటూ దౌర్జన్యానికి తెరదీశాడు. దీంతో దుకాణాలు నిర్వహించేందుకు సిద్ధపడి వచ్చిన వారు మరోమాట మాట్లాడకుండా డబ్బు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కొ దుకాణానికి రూ.1,500 చొప్పున వందకు పైగా దుకాణాల నిర్వాహకులతో బలవంతంగా డబ్బు వసూలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అక్కమాంబ ఆలయ
ఆదాయ వనరుల దోపిడీ
జాతరలో దుకాణాల ఏర్పాట్లపై ముందస్తుగానే వసూళ్లు
ఇదేమని ప్రశ్నిస్తే దేవుడికన్నా తామే గొప్ప అంటూ టీడీపీ నేత బరితెగింపు
Comments
Please login to add a commentAdd a comment