‘డాలీ’ సేవలు ప్రశంసనీయం
అనంతపురం: పోలీసు జాగిలం ‘డాలీ’ జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ పి. జగదీష్ అన్నారు. గత 11 సంవత్సరాలుగా సేవలందించిన ‘డాలీ’ శనివారం విధుల నుంచి నిష్క్రమించింది. ఈ సందర్బంగా డాలీకి ఎస్పీ సన్మానం చేశారు. హ్యాండ్లర్ నాగభూషణను అభినందించారు. 2014 సంవత్సరంలో 6 నెలల వయస్సు ఉన్నపుడు డాలీని అనంతపురం జిల్లాకు కేటాయించారన్నారు. దాదాపు 300పైగా నేర ప్రదేశాల్లో శోధించిందన్నారు. సుమారు 30 నేరాల ఛేదనకు దోహదపడిందని వెల్లడించారు.
ముగిసిన హెచ్చెల్సీ కోటా
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయం హెచ్చెల్సీ కోటా శనివారంతో పూర్తయింది. దీంతో నీటిని నిలుపుదల చేశారు. అదనపు జలాలతో కలిపి మొత్తం 33.931 టీఎంసీలు ఈ ఏడాది హెచ్చెల్సీకి విడుదలయ్యాయి. తొలుత దామాషా ప్రకారం కేవలం 26 టీఎంసీలు కేటాయించారు. వర్షాలు కురిసి జలాశయం నిండడంతో హెచ్చెల్సీ కోటా 30.881 టీఎంసీలు, కేసీ కెనాల్ కోటా 3.50 టీఎంసీలు మొత్తం 33.931 టీఎంసీలు విడుదల చేశారు. ఈ క్రమంలో 90,355 ఎకరాలకు సాగునీటిని అందించారు. వాస్తవంగా గత నెలలోనే కోటా పూర్తి కాగా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద పంటలు చివరి దశలో ఉండడంతో అదనంగా 0.5 టీఎంసీలను కేటాయించారు. ప్రస్తుతం కణేకల్లు చెరువులో 0.227 టీఎంసీలు, పీఏబీఆర్‌లో 3.029 టీఎంసీలు, ఎంపీఆర్‌లో 0.835 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పీఏబీఆర్ నీటిని రానున్న వేసవిలో తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఎంపీఆర్‌లో నిల్వ ఉన్న నీటిని సౌత్ కెనాల్, నార్త్ కెనాల్స్‌కు వరుసగా 200 క్యూసెక్కులు, 90 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’తో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ మాట్లాడుతూ తుంగభద్ర జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీళ్లు విడుదలయ్యాయన్నారు. అదనపు కోటా కలిపి 33.931 టీఎంసీలు విడుదల కావడంతో దాదాపు లక్ష ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు నీరు విడుదల చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment