బాలిక.. ఇంకా వెనక!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా రాణిస్తున్నా.. జననాల పరంగా మాత్రం అమ్మాయిలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 30 ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన ఐదు దశాబ్దాల్లో ఒక్కసారైనా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య పెరగలేదు. తాజా సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం అమ్మాయిల సంఖ్యా పరంగా ఇప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా అట్టడుగున ఉన్నట్లు వెల్లడైంది.
యథేచ్ఛగా లింగనిర్ధారణ..
ఉమ్మడి జిల్లాలో పలు రేడియోడయాగ్నస్టిక్స్ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణ జరుగు తోంది. ఈ దురవస్థ వ్యాపారంగా సాగుతోంది. కొంతమంది గైనకాలజిస్టులు, రేడియాలజిస్ట్‌లు అత్యంత గోప్యంగా ఏజెంట్ల ద్వారా అబార్షన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్లు, సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.
వారసుల కోసం ఆరాటం..
ఆస్తిపాస్తులు లేకపోయినా చాలా కుటుంబాల్లో ‘మగపిల్లాడు ఉండాలి.. వారసుడు అంటే మగపిల్లవాడే’ అన్న మూఢ విశ్వాసంతో ఉన్నారు. మహిళ గర్భం దాల్చిందని తెలియగానే ముందుగా ఆడపిల్లా, మగపిల్లాడా అని తెలుసుకునేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిన వారు రెండో కాన్పులోనైనా మగ పిల్లవాడి కోసం ఇలా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి నమ్మకాల వల్ల కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్మాయిలు లేక అబ్బాయిలకు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు.
అమ్మాయిల సంఖ్యలో చివరి స్థానంలో ‘ఉమ్మడి అనంత’
ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 977 మందే అమ్మాయిలు
సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి
బాలిక.. ఇంకా వెనక!
Comments
Please login to add a commentAdd a comment