టీటీసీ పరీక్ష ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ)–2024 థియరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. www. bse.ap. gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ ప్రసాద్‌బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జిల్లా కార్యాలయానికి చేరగానే అభ్యర్థులకు పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.
5,847 కేసుల పరిష్కారం
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘జాతీయ మెగా లోక్ అదాలత్’లో 5,847 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 బెంచ్‌లు నిర్వహించారు. బాధితులు రాజీకి సమ్మతించడంతో 886 క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు 80, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు 48, ప్రీ లిటిగేషన్ కేసులు 388 పరిష్కారమయ్యాయి. ప్రమాద కేసుల్లో బాధితులకు రూ. 3.83 కోట్లు పరిహారంగా అందించారు. సివిల్ కేసుల్లో రూ.2.82 కోట్లు, ప్రీ లిటిగేషన్ కేసుల్లో రూ.68 లక్షలు రాజీ ప్రకారం బాధితులకు ఇప్పించారు. లోక్‌అదాలత్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్ పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో కక్షిదారులకు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
కిరికెర సర్పంచ్‌కు
ఉత్తమ పురస్కారం
హిందూపురం: పంచాయతీ స్వశక్తి అధినేత్రి ఉత్తమ పురస్కారాన్ని హిందూపురం మండలం కిరికెర పంచాయతీ సర్పంచ్ వైఎన్ భాగ్యమ్మ అందుకున్నారు. ఢిల్లీలో 5,6 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కిరికెర సర్పంచ్ భాగ్యమ్మ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మహిళా సాధికారత, ఫ్రెండ్లీ ఉమెన్, గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి క్లుప్తంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆమెను ఉత్తమ అవార్డుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్ భాగ్యమ్మకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్ వినోద్‌కుమార్ చేతుల మీదుగా ‘పంచాయతీ స్వశక్తి అధినేత్రి పురస్కారం’తో పాటు జాతీయ ఉత్తమ ప్రశంసా పత్రం, షీల్డ్ అందించి అభినందించారు.
ఖాద్రీ లక్ష్మీనారసింహుడి
బ్రహ్మోత్సవాలకు వేళాయె..
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు.
నవధాన్యాల మొలక
సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు.
టీటీసీ పరీక్ష ఫలితాల విడుదల
టీటీసీ పరీక్ష ఫలితాల విడుదల
Comments
Please login to add a commentAdd a comment