‘వెలుగు’లో టీడీపీ నేత చిచ్చు
కుందుర్పి: స్వలాభం కోసం వెలుగు పథకంలో పనిచేస్తున్న ఏపీఎం, సీసీల మధ్య ఓ టీడీపీ నేత చిచ్చు రగిల్చాడు. ఇది కాస్త దావాలనమై కార్యాలయం నాలుగు గోడల మధ్య రెండు రోజుల క్రితం భగ్గున మండింది. పరస్పర దూషణలతో ఏపీఎం, సీసీ రెచ్చిపోయారు. కుందుర్పి మండల వెలుగు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో టీడీపీ నేత బండారం బట్టబయలైంది.
ఏం జరిగిందంటే..
కుందుర్పి మండలంలో పనిచేస్తున్న ఏపీఎం సర్ధానప్ప తీరుతో గత రెండు రోజులుగా మండల సమాఖ్య కార్యాలయంలో పెద్ద వివాదం నెలకొంది. పలు గ్రామాలకు చెందిన సంఘాల సభ్యులకు సంబంధించి రుణాల మంజూరుకు సీసీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏపీఎం దృష్టికి పంపారు. అయితే దీనిపై ఏపీఎం అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక టీడీపీ నేత సూచించిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల దరఖాస్తులను తిరస్కరించారు. దీనిపై సీసీలను బాధిత సభ్యులు నిలదీయడంతో ఇందులో తమ ప్రమేయం లేదని చేతులెత్తేశారు. రుణాల మంజూరు అంశం ఏపీఎం పరిధిలో ఉంటుందని సమాధానమిచ్చారు.
కుర్చీలు విసురుకుని...
రుణాల అంశంలో అన్యాయానికి గురైన పలువురు సభ్యులు రెండు రోజుల క్రితం వెలుగు కార్యాలయంలో ఏపీఎం, సీసీలను నిలదీశారు. అందరి సమక్షంలో ఏపీఎం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మండుటెండలో చెమటోడ్చి పనులు చేస్తున్నది టీడీపీ నేత కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. వివక్ష మాని అందరినీ సమదృష్టి చూడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో అక్కడే ఉన్న సీసీ తిమ్మప్పపై ఏపీఎం సర్దానప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. టీడీపీ నేత చెబితే పనిచేసి తీరాల్సిందేనని, తాను టీడీపీ నేత మాట వినప్పుడు మీరెందుకు వినరంటూ సీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. నువ్వెంతంటే.. నువ్వెంత అని దూషించుకుంటూ కుర్చీలను విసిరారు. అక్కడే ఉన్న సీ్త్ర నిధి మేనేజర్ గోవిందు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.
సీసీలు ఏమంటున్నారంటే..
ఘటనకు సంబంధించి పలువురు సీసీలు మాట్లాడుతూ.. తమ సంతకాలు లేకుండానే టీడీపీ నాయకులు చెప్పిన వారికి రుణాలు చేస్తానని ఏపీఎం సర్ధానప్ప చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ సంతకాలు లేకుండానే టీడీపీ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఏపీఎం రుణాలు మంజూరు చేయడం వివాదానికి కారణమైందన్నారు.
ఇదేం పెద్ద సమస్య కాదు
‘ఔను వాళ్లిద్దరూ వాదులాడుకున్నారు. కార్యాలయంలోనే గొడవ పడ్డారు. ఈ విషయంగా వారిని ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజ పిలిపించి మందలించాడు. ఆ సమయంలో నేను విజయవాడలో ఉన్నా. సోమవారం కార్యాలయానికి ఏపీఎం, సీసీలను పిలిపించుకుని మాట్లాడుతాను. ఇదేం పెద్ద సమస్య కాదు’.
– నారాయణస్వామి, ఏరియా కో ఆర్డినేటర్,
వెలుగు, కళ్యాణదుర్గం
టీడీపీ నేత చెబితే చేసి తీరాల్సిందేనంటూ స్వామి భక్తి చాటిన ఏపీఎం
సీసీల సంతకం లేకుండానే రుణాలు మంజూరు చేసిన వైనం
నాలుగు గోడల మధ్య పరస్పర
దూషణలతో రెచ్చిపోయిన వెలుగు సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment