కూటమి దగాపై కదం తొక్కాలి
అనంతపురం కార్పొరేషన్: విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’లో కదం తొక్కాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. ర్యాలీలో యువత భారీగా పాల్గొనాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నాఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. పైగా రూ.1.30 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది ఎగనామం పెట్టారన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని యువతను మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచైనా యువతకు అండగా నిలుస్తామన్నారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
12న ‘యువత పోరు’కు
భారీగా తరలిరావాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత పిలుపు
Comments
Please login to add a commentAdd a comment