పీఏబీఆర్‌లో తగ్గుతున్న నీటిమట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 2.99 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శ్రీసత్యసాయి, అనంత, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి పథకాలకు 55 క్యూసెక్కులు, ధర్మవరం కుడికాలువకు లీకేజీ ద్వారా 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి, ఇతర లీకేజీల రూపంలో మరో 40 క్యూసెక్కుల నీరు రోజూ బయటకు వెళుతోంది.
అబ్బుర పరిచిన
రాతిగుండు పోటీలు
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రాతిగుండు ఎత్తు పోటీలు అబ్బుర పరిచాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన పది మందికి పైగా పోటీల్లో పాల్గొన్నారు. కర్ణాటకు చెందిన కర్ణ అనే యువకుడు గుండును సునాయాసంగా ఎత్తి మొదటి స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. అలాగే రెండో స్థానంలో రాయదుర్గం నివాసి రాజశేఖర్, మూడో స్థానంలో డోన్ మండలం దొరసానిపల్లికి చెందిన చందు నిలిచారు. విజేతలను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు.
జాతీయ రహదారిపై
చైన్ స్నాచింగ్
బుక్కరాయసముద్రం: మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసముంటున్న రమేష్, వనజ దంపతులు కొంత కాలంగా గార్లదిన్నెలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వనజ, తన కుమారుడిని స్కూటీ వాహనంపై ఎక్కించుకుని గార్లదిన్నెకు బయలుదేరింది. లోలూరు క్రాస్ వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అడ్రస్ అడిగే నెపంతో వనజ వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో ఆమె దృష్టిని ఏమార్చి మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పీఏబీఆర్‌లో తగ్గుతున్న నీటిమట్టం
Comments
Please login to add a commentAdd a comment