ఖాద్రీశుడి కల్యాణము చూతము రారండి
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి కల్యాణోత్సవం సోమవారం రాత్రి 9 గంటలకు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి లోకేష్ స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొస్తారని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మీడియాకు తెలిపారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ కనులారా వీక్షించేందుకు ఆలయ, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. వేదికపై అర్చకులు మాత్రమే కూర్చునే విధంగా అధికారులు నిర్ణయించారు. కల్యాణోత్సవం జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొందరు అర్చక పండితులు హాజరుకానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీవారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
● స్వామివారిని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్‌ను సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
ఘనంగా అంకురార్పణ..
ముందుగా అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ గావించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మంగళ వాయిద్యాల మధ్య నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపానికి చేరుకున్నారు. అర్చక పండితులు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో పుట్ట మన్ను సేకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలిక(కుండ)లలో నవ ధాన్యాలతో అంకురార్పణ (బీజావాపం) చేశారు. ఈ నవధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ రోజూ నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ యేడాది బాగా పండుతుందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి, ఇక్కడి నుంచే తన భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నేడు స్వామివారి కల్యాణోత్సవం
ఖాద్రీశుడి కల్యాణము చూతము రారండి
Comments
Please login to add a commentAdd a comment