సిబ్బందికే ఉపాధి హామీ | - | Sakshi
Sakshi News home page

సిబ్బందికే ఉపాధి హామీ

Published Fri, Mar 14 2025 12:27 AM | Last Updated on Fri, Mar 14 2025 12:27 AM

సిబ్బ

సిబ్బందికే ఉపాధి హామీ

ఫీల్డ్‌ అసిస్టెంట్ల కూలీల అవతారం

వేతనం తీసుకుంటూనే కూలీలుగా అదనపు బిల్లులు

వారి పేర్ల మీదే సింగిల్‌ జాబ్‌ కార్డుల సృష్టి

కళ్యాణదుర్గం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘ఉపాధి’ హామీ పథకంతో సంపద సృష్టించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడ్డారు. గతంలో పనిచేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను బలవంతంగా తొలగించి, తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు ఆ బాధ్యతలను అప్పగించారు. తద్వారా నిరుపేద కూలీలకు దక్కాల్సిన నిధులను అప్పనంగా స్వాహా చేసేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫీల్డ్‌ అసిస్టెంట్ల మొదలు మండల స్థాయి నేతల వరకు ఈ అక్రమాలు ఊపందుకున్నాయి. ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగు చూస్తుండడంతో ఉపాధి కూలీలు నివ్వెర పోతున్నారు.

తారస్థాయికి చేరుకున్న అక్రమాలు

బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి, పాల వెంకటాపురం, ఎస్‌. కొండాపురం గ్రామాలకు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి కూలీల అవతారమెత్తారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి కుటుంబ సభ్యులకు ఉపాధి హామీ పథకంలో సింగిల్‌ జాబ్‌ కార్డులను సృష్టించి పేదల సొమ్మును దోచేసుకుంటున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున ప్రతి నెలా స్టాఫ్‌ శాలరీ కింద రూ.12,250 వరకు వేతనం అందుతుంది. అంతటితో ఆగకుండా కుటుంబ సభ్యుల పేరుతో సింగిల్‌ జాబ్‌ కార్డులు సృష్టించి అప్పనంగా ఉపాధి నిధులను దోచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ పేరుతోనే కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు జాబ్‌ కార్డులు సృస్టించుకుని పనులు చేయకుండానే చేసినట్లుగా రికార్డులు చూపిస్తూ నిధులను బ్యాంక్‌ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. తారస్థాయికి చేరుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల అక్రమాలు వెలుగు చూస్తున్నా... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

మామూళ్ల మత్తులో ఉపాధి అధికారులు

ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా.. అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఓ వైపు ప్రభుత్వ వేతనం తీసుకుంటూనే మరోవైపు ఉపాధి కూలీలుగా అవతారమెత్తి వేతనాలను దక్కించుకుంటున్నారు. బిల్లులు చేయించుకునేందుకు ఉపాధి కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ మొదలు ఈసీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఈసీ, ఎంపీడీఓ స్థాయి వరకూ మామూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం.

విచారించి చర్యలు తీసుకుంటాం

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రభుత్వం తరఫున వేతనం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వీరు జాబ్‌కార్డులు కలిగి ఉండకూడదు. అలాగే భార్య, భర్తలకు సంబంధించి సింగిల్‌ జాబ్‌కార్డులు జారీ చేయకూడదు. అలా జరిగి ఉంటే విచారించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం.

– నంద కిషోర్‌, ఎంపీడీఓ,

బ్రహ్మసముద్రం

మచ్చుకు కొన్ని...

బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గొల్ల నాగరాజు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి నెలకు రూ.9,750 చొప్పున వేతనం అందిపుచ్చుకున్నారు. అయినా తన భార్య గొల్ల లక్ష్మీదేవి పేరుతో సింగిల్‌ జాబ్‌ కార్డు (ఏపీ–12–020– 001–001/404231) సృష్టించాడు. ఆమె పేరున బ్యాంక్‌ ఖాతాకు గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకూ రూ.10,402 బిల్లులు చేసుకున్నాడు.

గొల్ల సన్నయ్య పేరుతో ఉన్న జాబ్‌ కార్డు నంబర్‌ (ఏపీ–12–020–001–001/010021)లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గొల్ల నాగరాజు ఉపాధి కూలీగా తన పేరును నమోదు చేసుకున్నాడు. గత ఏడాది 9వ నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు రూ.22,272 బిల్లులు తన ఖాతాకు మళ్లించుకున్నాడు.

పాల వెంకటాపురం గ్రామ పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గొల్ల రామచంద్ర అతని పేరు మీద సింగిల్‌ జాబ్‌ కార్డు (ఏపీ–12–020– 015–012–80814) సృష్టించుకున్నాడు. ఇతను కూడా కూలీ పనులు చేసినట్లుగా మస్టర్లు సిద్ధం చేసి గత ఏడాది 9వ నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు రూ.13,861 బిల్లులు చేసుకున్నాడు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గొల్ల రామచంద్ర తన భార్య జి.సునీత పేరుతో సింగిల్‌ జాబ్‌ కార్డు (ఏపీ–12–020–015–012–80813)ను సృష్టించి, గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ వరకు రూ.19,505 నగదును ఆమె ఖాతాకు మళ్లించాడు.

ఎస్‌.కొండాపురం గ్రామ పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శివమణి తన తల్లి బి.లక్ష్మీదేవి పేరుతో డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌ పథకం కింద 8 ఏళ్ల క్రితం మామిడి మొక్కలను నాటారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెకు సింగిల్‌ జాబ్‌ కార్డు సృష్టించి అప్పట్లో నాటిన మొక్కలకు ఈ ఏడాది ఫిబ్రవరి 3న మెటీరియల్‌ బిల్లు అంటూ రూ.15,303 నగదును ఖాతాకు మళ్లించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సిబ్బందికే ఉపాధి హామీ1
1/3

సిబ్బందికే ఉపాధి హామీ

సిబ్బందికే ఉపాధి హామీ2
2/3

సిబ్బందికే ఉపాధి హామీ

సిబ్బందికే ఉపాధి హామీ3
3/3

సిబ్బందికే ఉపాధి హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement