పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ ఆదేశించారు. ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణపై గురువారం జిల్లాలోని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శామ్యూల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్దన్నారు. తప్పులు లేని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకమని, ఎవరూ స్వల్పకాలిక ప్రయోజనాలకు ఆశ పడొద్దని హితవు పలికారు. సమావేశంలో డీఈఓ ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ పాల్గొన్నారు.
గంట ఆలస్యంగా సమావేశం
మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంటుందని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు సమాచారం అందించారు. వారంతా 1.30 గంటలకే చేరుకున్నారు. అయితే 3 గంటల తర్వాత సమావేశం ప్రారంభం కావడంతో ఉసూరుమన్నారు. జిల్లా సరిహద్దు మండలాల స్కూళ్ల నుంచి ఉదయం బయలుదేరి వచ్చామని, ఇంత ఆలస్యంగా ప్రారంభమైతే తాము తిరిగి ఊళ్లకు ఎలా వెళ్లాలంటూ వాపోయారు.
కోడింగ్‌లో పొరబాట్లకు తావివ్వొద్దు
పదో తరగతి జవాబు పత్రాల కోడింగ్‌లో పొరబాటుకు తావివ్వొద్దని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ సూచించారు. అనంతపురంలోని సైన్స్ కేంద్రంలో రాయలసీమ జిల్లాల్లోని కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్జేడీ మాట్లాడుతూ ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదన్నారు రెగ్యులర్ పరీక్షలతో పాటు ఓపెన్ పరీక్షలకు కూడా ఇదే విధంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల డీఈఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment