కంబదూరులో చిరుతల హల్‌చల్
కంబదూరు: మండల కేంద్రంలోని సిద్దుల కొండ సమీపంలో గురువారం చిరుతలు హల్‌చల్ చేశాయి. కొండ సమీపంలో ఉన్న తమ వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులకు కనిపించాయి. దీంతో భయాందోళన చెందిన రైతులు పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పెద్దోడు అనే రైతు వాటి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయని రైతులు తెలిపారు.
గుడ్డు.. వెరీ బ్యాడు!
కూడేరు: ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారు. వాటిని పిల్లలు తినలేక పారేస్తున్నారు. గురువారం కూడేరు మండల పరిధిలోని ఎంఎంహళ్లి ప్రాథమిక పాఠశాలలో ఉడకబెట్టిన కోడి గుడ్లు కుళ్లిపోయాయి. తెల్లటి సొన నల్లగా మారింది. మండలంలోని పాఠశాలలకు కొన్ని రోజులుగా ఏజెన్సీ నిర్వాహకులు నాసిరకం కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో పిల్లలు వాటిని తినకుండా పారేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
చిక్కీలో పురుగులు..
అధికారుల పరుగులు!
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని కస్తూరిబా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలకు సరఫరా చేసిన చిక్కీల్లో పురుగులున్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తి నేరుగా సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు మొబైల్‌కు ఓ వీడియో పంపడం కలకలం రేపింది. ఆయన వెంటనే పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్‌కు దాన్ని పంపి విచారణకు ఆదేశించారు. గురువారం జిల్లా పర్యటనలో ఉన్న ఆర్జేడీ...మధ్యాహ్నం ఉరుకులు, పరుగుల మీద పాతూరులోని కస్తూరిబా బాలికల పాఠశాలకు వెళ్లారు. ఆయనతో పాటు డీఈఓ ప్రసాద్‌బాబు, డీవైఈఓ శ్రీనివాసరావు, విద్యాశాఖ ఏడీ కృష్ణయ్య, తమ సిబ్బందితో వెళ్లారు. ఒకేమారు ఇంతమంది అధికారులు రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. కోడిగుడ్లు, చిక్కీలు ఉంచిన గది తాళాలు తెప్పించి చిక్కీల ప్యాకెట్లన్నీ పరిశీలించారు. ఫిబ్రవరి 17వ తేదీ, ఈనెల 4వ తేదీతో ముద్రించిన చిక్కీలను గుర్తించారు. వాటన్నింటినీ పాకెట్లు తీసేసి ఒక్కొక్కటీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ ఒక్క చిక్కీలోనూ పురుగులు కనిపించలేదు. ఆర్జేడీ, డీఈఓ అక్కడి నుంచి వెళ్లిపోయినా డీవైఈఓ, ఏడీ రెండుగంటలకు పైగా పరిశీలించారు. ఈ మొత్తం వ్యవహారమంతా వీడియో రికార్డ్ చేశారు. చివరకు ఎస్పీడీ నుంచి వచ్చిన వీడియో ఇక్కడికి సంబంధించినది కాదని తేల్చారు. విషయాలన్నింటిపై ఎస్పీడీకి నివేదిక పంపుతున్నామని డీఈఓ తెలిపారు.
కంబదూరులో చిరుతల హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment