విత్తనం.. లెక్కలేనితనం
ఏపీ సీడ్స్‌కు ‘చంద్ర’గ్రహణం
● బకాయిలు చెల్లించకుండా మొండికేసిన వైనం
● ఇటీవల రూ.100 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి అకౌంట్లు ఫ్రీజ్
● ఖరీఫ్‌లో నాణ్యమైన విత్తన సరఫరాకు ఇబ్బందే
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయమే దండగని చెప్పే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులకు నాణ్యమైన విత్తనాలూ అందకుండా చేస్తోంది. ఏకంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)నే నిర్వీర్యం చేసే దిశగా సాగుతోంది. ఈ సంస్థకు బకాయిలను చెల్లించకపోవడమే కాకుండా, ఇచ్చిన నిధులనూ వాడుకోకుండా బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. కనీసం రైతులు చెల్లించిన నాన్ సబ్సిడీ సొమ్ము కూడా పూర్తిస్థాయిలో అందకుండా చేసినట్లు తెలుస్తోంది. దీంతో రోజురోజుకూ ఏపీ సీడ్స్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో మరో మూడు నెలల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందకుండాపోయే దుస్థితి నెలకొంది.
అలా ఇచ్చి.. ఇలా లాగేసుకుంటోంది..
గతేడాది (2024–25) ఖరీఫ్, రబీ సీజన్లలో ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,79,245 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రాయితీతో పంపిణీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.261.09 కోట్లు బకాయి పడింది. ఇటీవల అందులో రూ.100 కోట్లు ఏపీ సీడ్స్ పీడీ అకౌంట్‌కు జమ చేస్తున్నట్లు జీఓ ఇచ్చారు. అయితే, సొమ్ము డ్రా చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్‌ను ఫ్రీజ్ చేసినట్లు చెబుతున్నారు. ఇదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సీడ్స్ జిల్లా అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిధులు ఇస్తున్నట్లు బయట చెప్పుకోవడానికి తప్ప ఏపీ సీడ్స్‌కు పైసా అందించడం లేదు. గతంలో అంటే 2018–19లో అప్పటి చంద్రబాబు సర్కారు దిగిపోయే సమయంలో కూడా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి ఏపీ సీడ్స్‌కు రూ.171.99 కోట్ల బకాయి పెట్టింది. కూటమి సర్కారు ఇప్పుడూ అదే చేస్తోంది. ప్రభుత్వ నిర్వాకంతో ఏపీ సీడ్స్ రైతులను ప్రోత్సహించి, ఉత్పత్తి చేసిన సర్టిఫైడ్ సీడ్‌ను కొనలేదు. ఈ క్రమంలో రైతులు నాణ్యమైన సీడ్‌ను తక్కువ ధరకు బయటి సంస్థలు, వ్యక్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరోపక్క పంటలు పండించే రైతులు బయటి మార్కెట్లో నాసిరకం సీడ్ కొనుక్కోవాల్సి వస్తుంది. మొత్తంమీద అన్నదాతకు అన్యాయం జరుగుతుంది.
ఉమ్మడి ‘అనంత’ బకాయిలు రూ.94 కోట్లు
గతేడాది ఖరీఫ్, రబీకి సంబంధించి ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఏపీ సీడ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.94 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు పైసా విడుదల చేయలేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.దీనివల్ల రానున్న ఖరీఫ్ లో రైతులకు నాణ్యమైన విత్తనం సరఫరా కాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 వేల క్వింటాళ్లు సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తికి రైతుల ద్వారా 3,500 ఎకరాల్లో వేరుశనగ, కంది పంటలను ప్రోత్సహించారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో రైతుల నుంచి నాణ్యమైన విత్తనం సేకరించడం కష్టమంటున్నారు. ఇప్పుడీ విత్తనం పరుల పాలవుతుందని, చివరకు మిల్లర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా నాసిరకం విత్తనం సరఫరా చేయాల్సి వస్తుందనే ఆందోళన నెలకొంది.
గత ప్రభుత్వంలో అవార్డులు..
గత ఐదేళ్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏపీ సీడ్స్‌కు ఎప్పటికప్పుడు నిధులు అందేవి. దీనివల్ల రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ద్వారా గ్రామ స్థాయిలోనే రైతులకు ఏపీ సీడ్స్ నాణ్యమైన విత్తనం సరఫరా చేసేది. దీంతో రైతులకు ఖర్చు తగ్గి, పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చేది. ఏపీ సీడ్స్ నిర్వహించిన కీలక పాత్రతో 2021–22, 2022–23లో జాతీయ అవార్డులు కూడా అందుకుంది. 2022లో ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డు కూడా దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment