
రూ.46 లక్షల విత్తనాలకు స్టాప్‌సేల్స్
అనంతపురం అగ్రికల్చర్: నాసిరకం కలింగర విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని బుధవారం స్థానిక శ్రావణి సీడ్స్ దుకాణం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైతు మురళీ ఆరోగ్యం నిలకడగా ఉంది. గురువారం వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏవో జే.శశికళ స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనం, పంట పెట్టుబడికి రూ.6.90 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రైతు తెలిపారన్నారు. అందుకు సంబంధించి బిల్లులు సేకరించామన్నారు. బీఏఎస్‌ఎఫ్ కంపెనీకి చెందిన కళింగర విత్తనాలకు సంబంధించి వివిధ దుకాణాల్లో సోదాలు నిర్వహించి రూ.20 లక్షల విలువ చేసే విత్తనాలకు అమ్మకాల నిలిపివేత (స్టాప్‌సేల్స్) ఉత్తర్వులు ఇచ్చామన్నారు. అలాగే సాంయత్రం శ్రావణి సీడ్స్ దుకాణంను తెరపించి తనిఖీ చేశామన్నారు. స్టాకు, సేల్స్ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. బీఏఎస్‌ఎఫ్‌తో పాటు మరికొన్ని కంపెనీలకు చెందిన రూ.26 లక్షలు విలువ చేసే కళింగర, కర్భూజా విత్తనాలకు స్టాప్ సేల్స్ ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. మొత్తంగా రూ.46 లక్షల విలువ చేసే విత్తనాల అమ్మకాలు నిలిపివేశామన్నారు. కమిషనరేట్, జేడీఏ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ, నాసిరకకం, నిషేధిత విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై నిఘా మరింత పెంచుతామని తెలిపారు.
కళింగర పంట పరిశీలన
బత్తలపల్లి: నకిలీ విత్తనాలతో మోసపోయి ఆత్మహత్యకు యత్నించిన గుజ్జల మురళి సాగు చేసిన కళింగర పంటను హార్టిక్చలర్ అధికారిణి అమరేశ్వరి, ఏఓ ఓబిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు డి.చెర్లోపల్లిలో పంట సాగు, పెట్టుబడి వివరాలను సర్పంచు గుజ్జల రమాదేవి, ఇతర రైతులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మురళి 3.74 ఎకరాల్లో కళింగర పంట ‘మాక్స్’ రకంను నవంబర్ 27న నాటారన్నారు. పంట కాల పరిమితి 70–75 రోజులు దాటినా కాయ లోపల తెలుపు రంగులో ఉండడంతో వ్యాపారస్తులు ఎవ్వరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. నకిలీ విత్తనాలు అంటగట్టడం వల్లనే ఇలా జరిగిందని, తద్వారా పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.
వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏఓ జే.శశికళ
ఆత్మహత్యకు యత్నించిన రైతుకు పరామర్శ

రూ.46 లక్షల విత్తనాలకు స్టాప్‌సేల్స్
Comments
Please login to add a commentAdd a comment