
హోలీ.. రంగుల కేళి!
అనంతపురం కల్చరల్ : పేద, ధనిక తారతమ్యాలన్నింటినీ రంగుల్లో కడిగేసే మధుర క్షణాలు హోలీ రూపంలో వచ్చేశాయి. రోజూ ఎన్నో ఒత్తిళ్లు, ఉరుకులు పరుగులతో కాలం గడచిపోతుంటే కాస్తంత ఉపశమనానికన్నట్లు సప్తవర్ణాల శోభను అద్దుకునేందుకు రంగుల కేళీ హోలీ శుక్రవారం సందడి చేయనుంది. పౌరాణిక గాథలు, చారిత్రక కథనాలతో కూడా హోలీకి తరతరాల బంధం ఉంది. సహజంగా అన్ని వర్గాల వారు ఎంతో ఇష్టపడే హోలీ జిల్లాలో అధిక శాతం స్థిరపడిన ఉత్తరాదివారు మరింత ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ఆనందాల హోలీ విషాదాల కేళీ కాకుండా ఉండేందుకు సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించాలని వైద్యులంటున్నారు.
సహజరంగులే ముద్దు
సాధారణంగా హోలీ ఆడిన తర్వాత చాలా మందిని ఇబ్బంది పెట్టేది చర్మసమస్యలు. ఇందుకు కారణం రంగుల్లో ఎక్కువ మోతాదులో రసాయన పదార్థాలుండడమే. ఈ తరహా రంగులు చర్మానికి హాని స్తాయనడంలో సందేహం లేదు. పొరపాటున కళ్లలో పడితే మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టే రంగుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు రసాయనాలకు బదులుగా సహజసిద్ధంగా ఇంటి వద్దనే తయారు చేసుకునే రంగులను హోలీ కోసం ఎంచుకోవాలని సూచిస్తున్నారు. దానికి తోడు వేసవి వచ్చేయడంతో నీటి ఇబ్బంది మరో రూపంలో సమస్యను తెచ్చిపెడుతుంది. విపరీతంగా నీళ్లను వృథా చేయడం కూడా మంచిది కాదని అందరూ చెప్పే మాట.
ఈ సూచనలు పాటిస్తే మేలు
● చవకగా దొరుకుతాయని రసాయనాలు కలిపిన రంగులతో హోలీ ఆడకుండా ఉండడం.
● ఎక్కువగా ఎరుపు, పింక్ రంగులనే వాడితే మంచిది. ఎందుకంటే ఇవి తక్కువ గాఢత కలిగి ఉండడం వల్ల శరీరంపై నుంచి సులభంగా తొలిగిపోతాయి.
● హోలీ ఆడడానికి ముందు ముఖానికి మాయిశ్చరైజర్, తలకు నూనెను రాసుకోవాలి. వీటి వల్ల రంగులు శరీరంలో ఇంకవు. శుభ్రం చేయడం కూడా సులువవుతుంది.
● ముఖంపై పడిన రంగులను శుక్రం చేసుకోవడానికి సబ్బు కన్నా క్లెన్సింగ్ మిల్క్ ఉత్తమమైనదని బ్యూటీషియన్స్ చెబుతారు.
● తక్కువ నీరుతో రంగులు పోవాలంటే మనం హోలీలో ఉపయోగించే రంగుల్లో ఎక్కువ మోతాదు ఆయిల్ వాడకం తగ్గించాలి. ఇంట్లో దొరికే పసుపు, కుంకుమ వంటివి ఎక్కువ హాని చేయవు.
సందర్భం
రంగుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
ఆనందంతో పాటూ ఆరోగ్యమూ ముఖ్యమే

హోలీ.. రంగుల కేళి!
Comments
Please login to add a commentAdd a comment