వైఎస్సార్ సీపీకే పూర్తి బలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మేయర్ పీఠం కోసం టీడీపీ దొడ్డిదారి ఎంచుకుంది. కార్పొరేషన్‌లో ఆ పార్టీకి సంఖ్యాబలం లేదు. అయినా, మేయర్ గిరీని దక్కించుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ ఎమ్మెల్సీ ఓటును కొనుగోలు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఓటుకు నోటు’ పద్ధతిని ఎంచుకున్నట్లుగానే.. అనంతపురం ‘పచ్చ’ పార్టీ నేతలు తమ అధినేత దారిలో నడుస్తూ కార్పొరేటర్లకు డబ్బుతో ఎర వేస్తున్నట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రెండు రోజులుగా పలువురు కార్పొరేటర్లను పిలిచి మాట్లాడుతున్నట్టు తెలిసింది. కార్పొరేషన్‌లో తమ దందా సరిగా జరగడం లేదని భావించి కుతంత్రాలకు తెరతీశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
దగ్గుపాటిని నమ్మితే అంతే...!
దగ్గుపాటి ప్రసాద్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అధిష్టానం వద్ద అనతి కాలంలోనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. నగరాన్ని మద్యంలో ముంచెత్తు తున్నారు. టౌన్‌లో మెజారిటీ మద్యం షాపులు ఆయనవే. దీనికి తోడు జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా దగ్గుపాటికి పెద్దగా సఖ్యత లేదు. పది నెలల్లోనే రకరకాల వ్యాపారాలు, వసూళ్లకు తెరలేపారనే విమర్శలున్నాయి. ఇక.. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి ఏమైనా జరిగిందీ అంటే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే. కూటమి సర్కారు ఏర్పడిన పది నెలల్లోనే కార్పొరేషన్‌ను మురుగు మయంగా, అవినీతికి నిలయంగా మార్చారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దగ్గుపాటి మాటలు నమ్మి పార్టీ మారితే ‘కుక్కతోక పట్టుకుని గోదారి ఈదిన’ చందంగా ఉంటుందని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక.. ‘సూపర్ సిక్స్’తో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తక్కువ కాలంలోనే తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. ఈ క్రమంలో నాలుగైదు లక్షల రూపాయల కోసం పార్టీ మారితే తమను నమ్మి ఓటేసిన ప్రజల ఎదుట తల కూడా ఎత్తుకోలేమని పలువురు చెబుతున్నారు. మరోవైపు అనంతపురం నగర పాలక వర్గం గడువు మరో ఏడాదిలో ముగుస్తుంది. ఈ క్రమంలో పార్టీ మారి ఎందుకు చెడ్డపేరు తెచ్చుకోవాలనే భావనలో కొందరు ఉన్నట్లు తెలిసింది.
అనంతపురం కార్పొరేషన్‌లో మొత్తం 50 కార్పొరేటర్ సీట్లు ఉన్నాయి. ఎన్నికల్లో 48 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. రెండు చోట్ల ఇండిపెండెంట్‌లు గెలుపొందారు. టీడీపీకి ఒక్క స్థానమూ దక్కలేదు. అయితే, ఆ తర్వాతి క్రమంలో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ప్రస్తుతం ఆ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. వీరందరినీ కలిపినా ఐదు సీట్లు కూడా దాటవు. అయినా, భారీగా డబ్బు ఆశ చూపి కార్పొరేటర్లను లాక్కుని మేయర్ పీఠం దక్కించుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తుండటం గమనార్హం.
సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ బరి తెగింపు
రెండు రోజులుగా
కార్పొరేటర్లతో మంతనాలు
ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షలు
ఇస్తామంటూ బేరాలు
ఎమ్మెల్యే దగ్గుపాటి ఓపెన్ ఆఫర్ పెట్టినట్టు విమర్శలు
వైఎస్సార్ సీపీకే పూర్తి బలం
Comments
Please login to add a commentAdd a comment