హెచ్చెల్సీ మరమ్మతులకు రూ.33.89 కోట్లు
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలో మరమ్మతు పనులకు రూ.33.89 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కణేకల్లు చెరువు 3వ స్లూయిస్ నిర్మాణానికి రూ. 22 లక్షలు, హెచ్‌ఎల్‌ఎంసీ 147 కిలోమీటరు వద్ద ఔట్‌ఫాల్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ. 4.20 లక్షలు, 137 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్ మరమ్మతులకు రూ. 1.52 లక్షలు, 169 కిలోమీటరు వద్ద డీఎల్‌ఆర్‌బీ నిర్మాణానికి రూ. 1.90 లక్షలు కేటాయించారు. అలాగే, పీఏబీఆర్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ. 4.06 కోట్లు, ఎంపీఆర్ రెగ్యులేటర్‌కు రూ. 4.07 కోట్లు, 155 కిలోమీటరు వద్ద డీఎల్‌ఆర్‌బీ నిర్మాణానికి రూ. 1.47 కోట్లతో పాటు మరో మూడు డీఎల్‌ఆర్‌బీ పనులకు మొత్తం రూ. 33.89 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ వివరించారు.
కోర్టు ఉత్తర్వుల మేరకే
నిర్మాణాల తొలగింపు
● ఆర్డీఓ కేశవనాయుడు
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట 106–1 సర్వే నంబరు పరిధిలోని విద్యారణ్యనగర్‌లో నిర్మాణాలు కోర్టు ఉత్తర్వుల మేరకే తొలగించామని ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాపంపేట సర్వే నంబరు 106–1లో 68 సెంట్లు, 106–2లో 16 సెంట్లు, 119 సర్వే నంబరులో 1.05 ఎకరాల శోత్రియం భూమిని ఆక్రమించారని, వారి నుంచి విడిపించాలని కోరుతూ 1983లో జీఎల్ కాంతారావు, జి.లక్ష్మీనరసయ్యలు పట్నం చంద్రమౌళేశ్వరరావుతో పాటు 27 మందిపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ (జిల్లా న్యాయ స్థానం, అనంతపురం)లో 120/83 పిటీషన్ దాఖలు చేశారన్నారు. ఈ క్రమంలోనే 1990లో ఏడుగురు ప్రతివాదులను షెడ్యూల్లో కనబరిచిన భూమి నుంచి ఖాళీ చేయించి పిటీషనర్లకు అప్పగించాలని అనంతపురం ఆర్డీఓను 1990 ఏప్రిల్ 16న కోర్టు ఆదేశించిందన్నారు. అప్పట్లోనే ఆర్డీఓ, తహసీల్దార్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆక్రమణదారులు భూమిని వదల్లేదన్నారు. 2021లో ప్రిన్సిపల్ కార్యదర్శి, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌పై పిటీషనర్ల వారసులు జి.హరిప్రసాద్, జి.నాగేంద్రబాబు, జీఎల్‌ఎన్ శ్రావణ్‌కుమార్ కేసు వేశారన్నారు. విచారించిన హైకోర్టు.. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ 2021 ఏప్రిల్ 28న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆ ఆదేశాల అమలు ఆలస్యం కావడంతో పిటీషనర్లు కంటెమ్ట్ (కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన) కేసు వేశారన్నారు. దీనిపై అప్పటి కలెక్టర్ కౌంటరు దాఖలు చేయగా.. 2024 డిసెంబరు 5న హైకోర్టు తుది తీర్పు ఇచ్చిందన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకున్నామని ఆర్డీఓ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment