అనంతపురం క్రైం: మహిళల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యమని సెర్ప్ సీఈఓ కరుణ వాకటి, కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో విలువ ఆధారిత మార్కెటింగ్ (వాల్యూ చేంజ్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్)పై అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి తొలి వర్క్‌షాప్ ఫ్లిప్‌కార్ట్– సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి సెర్ప్ సీఈఓ కరుణ వాకటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ సీఈఓ, కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్, సెర్ప్ ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. కందులు, వేరుశనగ, బియ్యం, చిరుధాన్యాలు, తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పీడీలు, డీపీఎంలు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. రైతులు పండించే పంటలలో నాణ్యత చాలా ముఖ్యమన్నారు. మార్కెట్‌తో అనుసంధానించిన ఉత్పత్తిదారుల సమూహాలను స్థాపించడానికి అట్టడుగు వ్యవసాయ వర్గాల నుంచి గ్రామీణ మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్ కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తలసరి ఆదాయం పెంచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. దళారుల బెడద లేకుండా ఎక్కువ ధర లభించేలా చూస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్, ఉద్యాన రంగంలో అనంతపురం జిల్లా రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా ఉందన్నారు. ఈ అంశంలో రైతులకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయి సహకారం అందించాలని, తగు సూచనలు, సలహాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ ఎగ్జిక్యూటివ్ బి.శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఆర్‌డీఏ పీడీ బి.ఈశ్వరయ్య, ఇతర జిల్లాల పీడీలు నరసయ్య, ఆనంద్ నాయక్, శ్రీధర్‌రెడ్డి, రమణారెడ్డి, ఫ్లిప్‌కార్ట్ గ్రాసరి మేనేజర్ గిరిబాబు, సెర్ప్ అదనపు డైరెక్టర్ సరళ, అదనపు డైరెక్టర్ మహిత, డీఆర్డీఏ–వెలుగు డీపీఎం బి.గంగాధర్, జిల్లా సమాఖ్య సెక్రటరీ, వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ సీఈఓ కరుణ, కలెక్టర్ వినోద్‌కుమార్
ఫ్లిప్‌కార్ట్, సెర్ప్ ఆధ్వర్యంలో అనంతపురంలో తొలి వర్క్‌షాప్