
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
అనంతపురం: డిప్లొమా కోర్సులకు డిమాండ్ భారీగా నెలకొంది. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులకు ఆసక్తి ఉన్న ఏ కోర్సులోనైనా చేరి ఇష్టంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
చిరుప్రాయంలోనే ఐదు అంకెల వేతనం..
పూర్తిగా ప్రాక్టికల్ ఓరియంటేడ్ సిలబస్ ఉన్న పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దీంతో 19 సంవత్సరాల్లోపే రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం అందుకునే అవకాశముంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య పూర్తి చేసే అవకాశం కేవలం డిప్లొమా కోర్సులతోనే సాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. సింహభాగం కంపెనీలు సైతం ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారి కంటే డిప్లొమా పూర్తి చేసిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిప్లొమా కోర్సుల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ తరువాత ఇంజినీరింగ్ కోర్సు చదివితే ఆరు సంవత్సరాల కాల వ్యవధి అనివార్యం. ఇలా కాకుండా కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం మూడేళ్లలో డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే కొలువు దక్కడం ఖాయమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.
కోర్ బ్రాంచ్‌లే అధికం..
ఇంజినీరింగ్‌లో కోర్ బ్రాంచ్‌ల్లో గణనీయంగా అడ్మిషన్లు పడిపోయి కొత్త బ్రాంచ్‌ల వైపు విద్యార్థులు చూస్తున్నాయి. కానీ డిప్లొమోలో కోర్ బ్రాంచ్‌లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి కోర్ బ్రాంచ్‌లతో పాటు కంప్యూటర్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా దక్కుతాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాలల్లో తరచూ ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో కోర్సు పూర్తి చేయడానికి మూడేళ్లకు కలిపి కేవలం రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ కింద) నేరుగా చేరవచ్చు. లేదా ఉద్యోగంలో చేరవచ్చు.
పాలీసెట్ ఎంట్రెన్స్ ఇలా..
పాలీసెట్‌ను 120 మార్కులకు నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ నెల 30న పాలీసెట్ నిర్వహించనున్నారు.
డిప్లొమా కోర్సులతో
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఈ నెల 30న పాలీసెట్
పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
ఉచిత శిక్షణ
పాలీసెట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు.
– సి.జయచంద్రారెడ్డి, పాలీసెట్
జిల్లా కో–ఆర్డినేటర్, అనంతపురం