
రేపు జగన్ పర్యటన
● పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య
కుటుంబానికి పరామర్శ
రామగిరి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం నాటి జిల్లా పర్యటన ఖరారైంది. రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులైన టీడీపీ నాయకుల చేతిలో దారుణహత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రానున్నారు. పర్యటన షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గాన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి 10.50 గంటలకు రోడ్డు మార్గాన ఎన్‌ఎస్ గేట్ మీదుగా బయల్దేరి 11.05 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుంటారు. 12.05 గంటల వరకు లింగమయ్య కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ధైర్యం చెప్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి కాన్వాయ్‌లో చెన్నేకొత్తపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.30 గంటలకు హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయల్దేరుతారు.
ఆలూరు కోనలో
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భూనీల సమేత శేష తల్ప రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురార్పణ, ధ్వజారోహణము, కలశస్థాపన, దీక్షా హోమంతో ఉత్సవాలను ప్రారంభించారు. పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సింహవాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు.

రేపు జగన్ పర్యటన