
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
అనంతపురం సిటీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్‌లో గల డీపీఆర్‌సీ భవన్‌లో ఆదివారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ వినోద్‌కుమార్, ఉభయ జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైస్ చైర్‌పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సంఘాల ప్రతినిధులు అనేక సమస్యలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. శ్మశాన వాటికల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని వెల్లడించారు. సబ్ ప్లాన్‌కు సంబంధించి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తామని, సివిల్ రైట్స్ డేని ఏప్రిల్ నుంచి ప్రతి తహసీల్దార్, ఎస్‌హెచ్‌ఓ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు లేని వారిని గుర్తించి న్యాయం చేస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా ఎదుగుతున్నారంటే అంబేడ్కర్ భిక్షేనని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అనంతపురంలోని అంబేడ్కర్ భవనానికి రూ.12 లక్షలు ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు చేస్తున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. కస్తూర్బాగాంధీ గురుకులాలతో పాటు మోడల్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం సీట్లను పెంచేలా చూస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. అంతకుముందు సందర్భంగా జెడ్పీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం
విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ క్యాంపస్‌లోని డీపీఆర్‌సీ భవన్‌లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకం రుణాలు, ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 12 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎన్‌డీఎఫ్‌డీసీ కింద రూ.27.55 లక్షల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. డిగ్రీ, ఇతర వృత్తి విద్య కోర్సులు అభ్యసిస్తున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.9.50 లక్షల విలువ చేసే ల్యాప్ ట్యాప్‌లు, నలుగురు బధిరులకు రూ.58 వేల విలువ చేసే టచ్ ఫోన్‌లు, మరో ఐదుగురికి రూ.56 వేల విలువ చేసే వీల్ చైర్లను పంపిణీ చేసినట్లు వివరించారు.
కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్